టీడీపీ నేతల నయా పంచారుుతీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా పెద్ద మనిషి అనే వాడు ఇద్దరు వ్యక్తులు పంచారుుతీకి వస్తే ఏం చేస్తాడు..? తప్పు ఎవరు చేశారో తేల్చి సదరు వ్యక్తికి జరిమానా విధిస్తాడు. కానీ.. ఘనత వహించిన అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు మాత్రం తప్పు చేసిన వాళ్లకు బాధితులతో బలవంతంగా నజారానాలు చెల్లించేటట్టు పంచారుుతీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన పొలాల్లోని వ్యవసాయ పంపుసెట్లను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు ఆనక బాధిత రైతులను ఓ బడాబాబు వద్దకు పంచారుుతీకి పిలిపించారు. ఆ భూముల్లో సాగు చేసుకోవాలంటే తమకు డబ్బులు ఇచ్చేవిధంగా సెటిల్‌మెంట్ చేశారు. దీనినిబట్టి పచ్చచొక్కాల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగిందంటే...
టి.నరసాపురం మండలం అల్లంచర్లపాలెంలోని 398 ఎకరాల 94 సెంట్ల వ్యవసాయ భూమి (సర్వే నంబర్ 226)ని సుమారు 40మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సర్కారీ రికార్డులను పరిశీలిస్తే.. 1933లో నూజి వీడు జమీందార్ ఆ భూమిని రాజా రాఘవరాజు రంగరాజుకు ఇచ్చారు. 1956లో రంగరాజు ఈ భూములను అల్లంచర్లపాలెంకు చెందిన కోసూరి బంగారురాజు వారసులకు, మరో 29 మందికి విక్రయించారు. వీరినుంచి క్రయవిక్రయాలు జరిగి మొత్తంగా 1959 తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు వచ్చాయి. రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం సాగుచేసుకుంటున్న నేపథ్యంలో 1970వ సంవత్సరంలో అటవీశాఖ అధికారులు ఆ భూములు తమ శాఖకు చెందినవంటూ ఫారెస్ట్ సెటిల్‌మెంట్స్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 1995లో తిరిగి ఇవే భూములపై అటవీశాఖ అధికారులు డెరైక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్‌మెంట్స్‌కు అప్పీల్ చేసుకోగా.. సుదీర్ఘకాలం తర్వాత 2010లో అటవీ భూమిగా తేల్చి పట్టాలు రద్దు చేశారు. మళ్లీ దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ఉన్నత న్యాయస్థానం రైతుల పక్షాన మొగ్గుచూపి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి మొత్తంగా ఈ భూముల వ్యవహారం కేసును పరిశీలించాల్సిందిగా భూపరిపాలన కమిషనర్‌ను ఆదేశించింది. ఆ విభాగం నుంచి ఎటువంటి స్పష్టత రాని నేపథ్యంలో రైతులు యథావిధిగా పొలాల్లో సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అసలు కథ మొదలైంది.
వైఎస్సార్ సీపీ నేతల పొలాలు ధ్వంసం
అధికారం అండ దొరకగానే టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల ఆస్తుల ధ్వంసరచనకు తెగబడటం మొదలుపెట్టారు. జూలై 26న ఇక్కడి పంట పొలాల్లో స్వైరవిహారం చేసి మోటార్లను, పంపుసెట్లను ధ్వంసం చేశారు. అటవీ భూము ల్లో సాగు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ అభిమానులుగా ఉంటున్న రైతులు, నాయకుల పొలాలను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టిం చారు. హైకోర్టు స్టే ఉన్న పొలాల్లోను, ఇంకా విచారణలో ఉన్న ఈ వ్యవహారంపైన టీడీపీ నేతల అరాచకమేమిటని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించినా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు.
దీంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ పొలాల్లోని మోటార్లను ధ్వంసం చేశారు. ఇందుకు ప్రతిగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలూ ప్రత్యర్థులకు చెందిన పొలాల్లోని మోటార్లను పగులగొట్టారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు చివరకు అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపించారు. టీడీపీ శ్రేణులపై మాత్రం న్యూసెన్స్ కేసు పెట్టి ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.
బాధిత రైతుకు జరిమానా
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ బడా బాబు రంగంలోకి దిగి సెటిల్‌మెంట్ చేస్తానంటూ ఇరువర్గాలకు చెందిన రైతులను పిలిపించుకున్నట్టు తెలిసింది. అక్కడ సజావుగా సాగు చేసుకోవాలన్నా, మరోసారి తమవాళ్లు అక్కడకు వచ్చి హల్‌చల్ చేయకుండా ఉండాలన్నా ఒక్కొక్క రైతు రూ.4 లక్షల చొప్పున తమ పార్టీకి చెందిన వారికి ఇవ్వాల్సిందిగా సెటిల్‌మెంట్ చేశారని చెబుతున్నారు. పంట మధ్యలో ఉండటం, మోటార్లు లేక నీళ్లు రాక చివరకు పెట్టుబడులు కూడా రావని భయపడిన కొందరు రూ.4 లక్షల చొప్పున ముట్టజెప్పి సాగు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవలే జరిగిన ఈ సెటిల్‌మెంట్ వ్యవహారం ఆ నోటా నోటా బయటపడటంతో ఇంటలిజెన్స్ వర్గాలు మొత్తం వ్యవహారంపై దృష్టిసారించినట్టు తెలిసింది.