ఆలయాలను కూల్చి తెలియదంటారా!
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆలయాలు, మసీదులను ఇష్టానుసారం కూల్చేసి ఇపుడు తనకేమీ తెలియకుండా జరిగి పోయిందని చంద్రబాబు మాట్లాడ్డం చూస్తూంటే ఆయన పరిపాలన ఎంత బాధ్యతారహితంగా ఉందో తేటతెల్లమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆలయాలు, మసీదులను పద్ధతి లేకుండా కూల్చి వేశారని చంద్రబాబు ఓవైపు అంగీకరిస్తూనే.. మరో వైపు ఇదేదో టీడీపీ, బీజేపీకి సంబంధించిన వివాదంగా చూపించే ప్రయత్నం చేయటం శోచనీయమన్నారు. ఇది కచ్చితంగా మతపరమైన మనోభావాలపై దాడేనన్నారు. బాబు ఈ విషయం గుర్తించకుండా రోడ్లమీద గుళ్లు అడ్డంగా కట్టవద్దని తానెప్పుడో చెప్పానని అనటాన్ని చూస్తూంటే... కొన్ని దశాబ్దాల కాలం ముందు నుంచీ ఉన్న గుళ్లను, రోడ్లకు అడ్డంగా ఉన్నట్లు ఏ లెక్కన చెబుతారని ప్రశ్నించారు. ఇపుడు దేవాలయాల ధ్వంసంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
డెయిరీని మూయించే పనిలో చంద్రబాబు: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్
తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ డెయిరీని మూయించే పనిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ డెయిరీని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.