సాక్షి, తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను టీడీపీ నేతలు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను టీడీపీ నేతలు సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని తెలిసింది. శ్రీవారి సేవా టికెట్లు, ప్రత్యేక దర్శనాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా తిరుమలలో తిష్టవేసి దందా చేస్తున్న టీడీపీ శ్రేణుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక హోదా సంజీవనా? అన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపించడంతో ప్లేటు ఫిరాయించి ధర్మ పోరాట దీక్ష పేరుతో హై డ్రామాకు తెరతీసిన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా ఖర్చుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగని టీడీపీ పెద్దలు గత ఏడాది టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వినియోగించుకున్నారని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తుడు ఆకాశ రామన్న ఉత్తరం ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. ఆకాశ రామన్న ఉత్తరంతో పాటు శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని టీటీడీ నిధులు రూ.4 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నిధులను టీడీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు ఖర్చుచేసినట్లు సమాచారం. దీక్ష జరిగినన్ని రోజులు ఏర్పాట్లు, టీడీపీ శ్రేణులకు ఢిల్లీలోని ఆలయం నుంచి అన్నప్రసాదాలు, టీ, ఫలహారం వంటివి టీటీడీ నిధులతోనే ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అన్న ప్రసాదాలు అక్కడి ఆలయంలోని అయ్యవార్ల వద్దే తయారు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చెయ్యడం తెలిసిందే. అప్పటి టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చెయ్యడంతో పాటు టీటీడీ నిధులను కూడా మళ్లించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో టీడీపీ దళారుల తిష్ట
తిరుమలలో ఆదాయాన్ని రుచిచూసిన టీడీపీ నేతలు కొండపైనే తిష్టవేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్, బోర్డు మెంబర్ల లేఖలను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్న వారిలో అనేకమంది టీడీపీ నేతల పీఆర్వోలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతలు వారి తరఫున పంపే లేఖలో నలుగురు పేర్లు ఉంటే మరో ఇద్దరి పేర్లు చేర్చి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజూ టీడీపీ నేతల లేఖలతో పీఆర్వోలు కొందరు వ్యాపారం చేసుకుంటున్నారు. విజిలెన్స్ తనిఖీల్లో పట్టుబడిన దళారుల్లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పీఆర్వోలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకుంటున్నారు.
ఇక్కడితో ఆగని టీడీపీ శ్రేణులు అధికారుల దృష్టి మరల్చటంతో పాటు ప్రభుత్వంపై బురద చల్లేందుకు అన్యమత ప్రచారం పేరుతో దుష్ప్రచారానికి దిగారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముద్రించిన ఆర్టీసీ టికెట్లను టీడీపీ సానుభూతిపరులు ప్రయాణికులకు ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. టీడీపీకి చెందిన వారే టికెట్లు తీసుకొచ్చి.. ప్రయాణికులకు ఇచ్చి వారి ద్వారా ప్రభుత్వంపై తప్పుగా ప్రచారం చేయించడం ప్రారంభిం చారు. టీడీపీ నేతలు పథకం ప్రకారం చేసిన తప్పుడు ప్రచారం గంటల వ్యవధిలోనే వెలుగు చూడడంతో భక్తులు ‘పచ్చ’ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల శ్రీవారి తో ఆటలు ఆడుకుంటే ఆ దేవుడే తగిన గుణ పాఠం చెబుతారని భక్తులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment