'2009 తర్వాత టీడీపీ 35 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది'
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా విజన్ ఉన్న నాయకుడైతే తన 9ఏళ్ల పాలనలో పులిచింతల ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేదని బాలశౌరీ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కో్ల్పోయిందనడానికి 2009 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన 53 అసెంబ్లీ ఎలక్షన్లలో 35 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అన్ని స్థానాల్లో ఓటమిపాలైంది టీడీపీ కాదా? అని బాలశౌరీ నిలదీశారు.
రాబోయే కాలంలో రాష్ట్రానికి ఒక దశాదిశను నిర్దేశించగల నేత ఒక్క జగనేనని బాలశౌరీ అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆయన విశ్వాసం ప్రకటించారు.