కలకలం రేపిన రేవంత్‌రెడ్డి వ్యవహారం
బాబు అండ్ కో ఎంతకైనా దిగజారుతుందంటున్న విపక్షాలు
చంద్రబాబునూ అరెస్ట్ చేయాలని డిమాండ్
జంగారెడ్డిగూడెంలో ధర్నా
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పదవులే పరమావధిగా.. అడ్డదారిలో గెలవడమే లక్ష్యంగా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి బరితెగించిన వైనం జిల్లాలోనూ చర్చనీయాంశమైంది. మాటకు ముందు.. వెనుక నీతి, నిజాయితీలంటూ కబుర్లు చెప్పే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు నిజస్వరూపం బట్టబయలైందనివిపక్షాలు విమర్శలు సంధిం చాయి. అధికారం కోసం చంద్రబాబు అండ్ కో ఎంతకైనా దిగజారుతుందని.. నీతిమాలిన రాజకీయాలు చేస్తుందనే విషయం మరోసారి రుజువైందని టీడీపీయేతర పార్టీలన్నీ మండిపడ్డాయి.
టీడీపీ నేతల బజారు రాజకీయం వల్ల ఇరు రాష్ట్రాలతోపాటు యావత్ దేశంలోనూ తెలుగువాళ్ల పరువుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏసీబీ అధికారులకు రేవంత్ అడ్డంగా దొరికాడు కాబట్టే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది కానీ.. మన రాష్ట్రంలో.. ముఖ్యంగా మన జిల్లాలోనూ ఇలాంటి బాపతు నేతలు ఎక్కువమందే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వంక రవీ్రంద విమర్శిం చారు. ‘దొరికినోడే దొంగ చందాన రేవంత్ కటకటాల్లోకి వెళ్లాడు.. ఇక్కడ నేతలు దొరకలేదంతే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడి నేతలకూ అదే గతి
పదేళ్ల తర్వాత ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయిందనడానికి ఇదే సాక్ష్యమని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకటరావు విమర్శించారు. ‘ఎక్కడ ఆదాయ వనరులుంటే అక్కడ వాలిపోయారు. ప్రతి పనిలోనూ నాకేంటి అని లెక్కలు వేసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇసుక, మట్టి, పుష్కర పనులు, ఉద్యోగుల బదిలీలు అన్నిటినీ ఆదాయ మార్గాలుగా మార్చేశారు. ఏడాది పాలనలో ఎవరికైనా లబ్ధి చేకూరిందంటే కేవలం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకే అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎప్పుడోసారి అక్రమాలన్నీ బయటపడి ఇక్కడి నేతలకూ అదే గతి పట్టడం ఖాయం’ అని విమర్శించారు.
చంద్రబాబునూ అరెస్ట్ చేయాలి : పీసీసీ చీఫ్ రఘువీరా
ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన చంద్రబాబును అరెస్ట్ చేయాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ‘మా బాస్ చెబితే వచ్చాను అని రేవంత్ సంభాషణలు స్పష్టంగా వీడియోలో వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బాబును అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తేనే కేసు ముందుకు వెళ్తుంది’ అని సోమవారం కాళ్లలో పర్యటించిన రఘువీరా అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అధికార దాహానికి పరాకాష్ట
తెలుగదేశం పార్టీ అధికార దాహానికి తెలంగాణలో వెలుగుచూసిన ఘటన పరాకాష్ట. ఏ ఎన్నికల్లోనైనా ప్రలోభాలకు పాల్పడటం టీడీపీకి కొత్తకాదనే విషయం దీంతో స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునిపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీలో జగన్ మోహన్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగుతున్న టీడీపీ నాయకుల నిజస్వరూపం ఈ ఘటనతో బయటపడింది. తెలుగు వారిని అవమానానికి గురిచేసిన టీడీపీ నాయకుడు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.
- పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి,
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
రాజకీయాల నుంచి తప్పుకోవాలి
ఎంతోమందిపై అవినీతి ఆరోపణలు చేసే టీడీపీ నాయకులకు తమ పార్టీ అధ్యక్షుడే పెద్ద అవినీతిపరుడనే నిజం తెలియదా. గతంలో రాజకీయాలు విలువలకు కట్టుబడి ఉండేవి. టీడీపీ ఆ విలువలకు వలువలు విప్పిం ది. డబ్బుతో దొరికిపోయిన తరువాత కూడా రేవంత్‌రెడ్డి ఇంకా వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు. అవినీతికి పాల్పడుతూ దొరికిపోయిన ఆ పార్టీ రాజకీయాల నుంచి వైదొలగాలి. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి
- డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి, సీపీఐ
రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు
ప్రజాస్వామ్యంలో ఓటర్లను, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య. ఒక ఎమ్మెల్యేకు డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని కోరడం ద్వారా రాజ్యాంగాన్నే అపహాస్యం చేశారు. రేవంత్‌రెడ్డి ఈ నేరానికి పాల్పడితే అతనిని శిక్షించాల్సిందే. గతంలో పీవీ నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. అప్పట్లో కొంతమంది పదవులు కోల్పోయారనే విషయం గుర్తుంచుకోవాలి.
- భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు, బీజేపీ
బాబు బండారం బట్టబయలు
Published Tue, Jun 2 2015 1:45 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement