టీడీపీలో పెరుగుతున్న బీపీ | TDP mlas against to partry on nominated posts | Sakshi

టీడీపీలో పెరుగుతున్న బీపీ

Published Wed, Feb 11 2015 12:32 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

టీడీపీలో పెరుగుతున్న బీపీ - Sakshi

టీడీపీలో పెరుగుతున్న బీపీ

అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయా నియోజకవర్గాల్లో విభేదాలకు కారణమైంది.

పదవుల కోసం కుమ్ములాటలు
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయా నియోజకవర్గాల్లో  విభేదాలకు కారణమైంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జులపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులుగా నియమితులైన చోట తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే బాహాబాహీలకు దిగుతున్నారు. రెండు మూడు నియోజకవర్గాల్లో  తమ ఇన్‌చార్జిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  
 
 మార్కాపురంలో ప్రచ్ఛన్న యుద్ధాలు..
 ఈ నియోజకవర్గంలో ప్రచ్ఛన్న యుద్ధాలకు కొదవేమీ లేదు. టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని వ్యతిరేకిస్తూ పార్టీలోనే ఉన్న టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. పార్టీలోని ప్రధాన నాయకులు కాశీనాథ్‌కు మద్దతు ఇస్తున్నారు. తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, మార్కాపురం మండలాల్లోని పలువురు టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్లు కాశీనాథ్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం పార్టీ రాష్ట్ర నాయకుని దృష్టికి వెళ్లింది. కందుల నారాయణరెడ్డిపై ఇటీవల మార్కాపురం, పొదిలిలలో కరపత్రాలను కూడా ప్రచురించారు. కరపత్రాల వెనుక సొంత పార్టీలోని ముఖ్య నాయకుల పాత్ర ఉందని కందులవర్గం అనుమానిస్తోంది. ఈ నెల ఒకటిన మార్కాపురం పట్టణంలో రజక సంఘం సమావేశానికి కరణం బలరాం వచ్చినప్పుడు ఆయనను ఇమ్మడి కాశీనాథ్ వర్గం కోర్టు సెంటర్‌లో ఆహ్వానించగా, పాత బస్టాండ్‌లో జరిగిన సమావేశానికి కందుల నారాయణరెడ్డి వర్గం ఆహ్వానించడం ద్వారా విభేదాలు బట్టబయలలయ్యాయి.
 
 కనిగిరి: ఈ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కనిగిరి నగర పంచాయతీలో రెండు, మూడు గ్రూపులుగా మారాయి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య పోరు సాగుతోంది. పీసీపల్లి, పామూరు, సీఎస్‌పురంలో పాత, కొత్త టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఒకరు ఔనంటే మరొకరు కాదనే పరిస్థితి. పీసీపల్లిలో రేషన్ డీలర్లకోసం రెండు గ్రూపులు బహిరంగంగానే ఘర్షణ పడ్డారు. సీఎస్‌పురం మండలంలో  రెండు రోజుల క్రితం పాఠశాల ప్రారంభోత్సవంలో పాత, కొత్త టీడీపీ నేతల్లో అసంతృప్తులు ప్రారంభయ్యాయి. దీంతో మంత్రి రావెల, ఎమ్మెల్యే కదిరి పాఠశాల భవనం ప్రారంభాన్ని వాయిదా వేసి వెళ్లారు.  కనిగిరి మండలంలో కూడా పాత, కొత్త టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు.
 
 కందుకూరు: మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి కేటాయింపు విషయంలో  నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ప్రధాన అనుచరుడు తల్లపనేని వెంకటేశ్వర్లుకి మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. దీంతో మొదటి నుంచి ఈ పదవిని ఆశిస్తున్న పార్టీ సీనియర్ నాయకులైన పిడికిటి వెంకటేశ్వర్లు నాదెళ్ళ వెంకట సుబ్బారావు, ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా హరిబాబు, ఎంపీపీ అనూరాధ భర్త గుళ్లా శ్రీనివాసులు, సోమినేని రవీంద్ర వంటి నాయకులతోపాటు, మొదటి నుంచి శివరాంకి వ్యతిరేకంగా ఉండే జిల్లా డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు వర్గం కూడా  శివరాంతో తలపడుతోంది. శివరాం వ్యవహరిస్తున్న తీరుపట్ల బహిరంగంగానే విమర్శలకు దిగడంతోపాటు వేరుకుంపటి పెట్టుకున్నారు.
 
 తామంతా దామచర్ల జనార్ధన్ వర్గంగా ప్రచారం చేసుకుంటున్నారు. శివరాంకి వ్యతిరేకంగా నియోజవకర్గంలో కార్యకలాపాలు ప్రారంభించారు. జెడ్‌పీటీసీ కంచర్ల శ్రీకాంత్ కూడా మొదట్లో అసమ్మతి వర్గంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం శివరాంతో కలిసిపోతున్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీకి అండగా ఉన్న నాయకులను వదిలేసి కేవలం తల్లపనేని వెంకటేశ్వర్లుకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల మార్కెట్‌యార్డు చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలోను లుకలుకలు బయటపడ్డాయి. అసమ్మతి నేతలెవ్వరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదు. పైగా శివరాం వ్యవహార శైలిపై మంత్రి శిద్దారాఘవరావుకి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌కి ఫిర్యాదు చేశారు.
 
 యర్రగొండపాలెంలో జెడ్పీటీసీ డాక్టర్ మన్నె రవీంద్ర, ఇన్‌ఛార్జి అజితరావుల మధ్య కూడా పొరపచ్చాలు తారాస్థాయికి చేరాయి. అజితారావు భర్త బూదాల కోటేశ్వరరావు పెత్తనాన్ని రెండోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై చంద్రబాబునాయుడి వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఇన్‌ఛార్జిని మార్చాలని మన్నె రవీంద్ర డిమాండ్ చేస్తున్నారు. రేషన్‌షాపు డీలర్ల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు పొడచూపుతున్నాయి.
 
 కోల్డ్‌వార్..
 మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌కు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీధర్‌కు మధ్య సంతనూతలపాడు నియోజకవర్గంలో కోల్డ్‌వార్ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్‌కు శ్రీధర్ సరిగ్గా సహకరించలేదన్న కారణంతో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శ్రీధర్‌కు రాకుండా అడ్డం పడుతున్నారు. దీంతో నాలుగు మండలాలలోని టీడీపీకి చెందిన ఐదారుగురు మాజీ సర్పంచులు, గ్రామస్థాయి నాయకులు కరణం బలరాంను, దామచర్ల జనార్ధన్ ను కలిసి తమకు విజయ్‌కుమార్‌ను ఇన్‌చార్జి నుంచి తొలగించాలని ఇటీవల కొంత హడావుడి చేస్తున్నారు. ఇటీవల తమ నేత లోకేష్‌ను కలిసి విజయకుమార్‌ను తొలగించాలని కోరారు.  
 
 అసంతృప్తి..
 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ ఒంగోలు నియోజకవర్గంలో యాదవులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు యోగయ్య యాదవ్ ఇంట్లో యాదవ సామాజిక వర్గం సమావేశమై ఈ పదవి తమకే దక్కాలని డిమాండ్ చేసింది. ఈ పదవిని మరో సామాజిక వర్గానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ నిర్ణయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement