అవసరమైతే కొత్త పార్టీ పెడతా
అమరావతి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవులు రాని టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అధికారంలో లేనపుడు పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు రాలేదని ధూళిపాళ్ల ఆవేదన చెందుతున్నారు.
ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో చింతమనేని తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తానని, అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని చింతమనేనిపై అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడాన్ని చింతమనేని జీర్ణించుకోలేకపోతున్నారు.
మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ వైఖరిపై అలకబూని గన్‌మెన్‌లను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు మరో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అలిగారు. పార్టీ కోసం పనిచేస్తున్నా మంత్రి పదవి ఇవ్వరా అని ఆక్రోశం వ్యక్తం చేశారు.