
గరికపాటికి సీటు ఖరారు!
నామినేషన్‌కు సిద్ధం కావాలన్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు పేరు ఖరారైంది. రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తన కోటరీ నుంచి ఒకరికి టికెట్ ఇస్తున్న చంద్రబాబు.. ఈ సారి గరికపాటి పేరును ఖరారు చేశారు. గతంలో రెండుసార్లు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను చంద్రబాబు వరుసగా రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఈసారి గరికపాటి పేరును ఖరారు చేసిన బాబు.. నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక మరో సీటు కోసం సీమాంధ్ర ప్రాంతం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గరికపాటి అభ్యర్థిత్వం ఖరారు కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించిన ఎంపీ సుజనా చౌదరి... సీమాంధ్ర నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేదా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పి.నారాయణకు సీటు ఇవ్వాల్సిందిగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
‘నారాయణకు రాజ్యసభ సీటు ఇవ్వడమనేది నా ఆబ్లిగేషన్. నేను సూచించిన వ్యక్తికి కాకుండా మరెవరికి చంద్రబాబు సీటు ఇస్తారు..?’ అంటూనెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత వద్ద సుజనా వ్యాఖ్యానిం చినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, గుంటూరు జిల్లాకు చెంది న పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టార్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ (బాబ్జీ), బోండా ఉమామహేశ్వరరావు తదితరుల పేర్లను రాజ్యసభ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సీటుపై ఆశలు వదులుకున్న కంభంపాటి రామ్మోహనరావు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
అలకవీడని మోత్కుపల్లి!
రాజ్యసభ టికెట్ కావాలని పట్టుబడుతున్న మోత్కుపల్లి నర్సింహులు వరుసగా రెండోరోజూ శాసనసభకు రాలేదు. సన్నిహితులు ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయగా... చంద్రబాబు తనకు అన్యాయం చేశారని చెప్పినట్లుగా వారు పేర్కొంటున్నారు.