అడ్డదారిలో అందలమెక్కారు
ఆమదాలవలస: మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ అడ్డదారిలో కైవసం చేసుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. తన స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోను, ఆమదాలవలస నియోజకవర్గంలో నూకలు చెల్లాయన్నారు. ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీని పట్టణ ప్రజలు పట్టం కట్టారని, అటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలలో కాం గ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయని ఆరోపించారు.
పట్టణ ప్రజలు అధిక వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించినా ఎక్స్ అఫీషియో ఓటుతో టీడీపీ నాయకులు పట్టణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవిభజనకు ముందు నుంచే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ ముందుగానే చెప్పిందని, ఇప్పుడు అది రుజువైందన్నారు. పట్టణ ప్రజలు వైఎస్సార్ సీపీ వెంటనే ఉన్నారని, టీడీపీ విజయం వాపు మాత్రమేనని బలుపు కాదని ఆపార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇలాంటి నీచరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యేనని విమర్శించారు. కౌన్సిలర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ మాట్లాడుతూ సుమారు 30 ఏళ్లుగా మున్సిపాలిటీలో బొడ్డేపల్లి కుటుంబీకులు పాలన సాగించేవారని, అంతటి పాలనకు మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్‌లను టీడీపీకి అందించి ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారని, రానున్న రోజుల్లో బొడ్డేపల్లి కుటుంబీకులకు రాజకీయ భవిష్యత్ శూన్యమని అన్నారు. ఇంతటి నీచరాజకీయాలను చూసిన మాజీ ఎమ్మెల్యే మామ, మకుటములేని మహరాజు, నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, బొడ్డేపల్లి రవికుమార్, కౌన్సిలర్ లు దుంపల శ్యామలరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎస్.మురళీధరరావు, పొడుగు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ అఫీషియో గట్టెక్కిన టీడీపీ
శ్రీకాకుళం కలెక్టరేట్: ఆమదాలవలస పురపాలక సంఘంలో బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, ఇండిపెండింట్‌కు ముడుపులు చెల్లించి ఎక్స్ అఫీషియో ఓటుతో అధ్యక్ష పీఠాన్ని సాధించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది కౌన్సిలర్ల బలం ఉన్న టీడీపీకి ఎక్స్ అఫీషియో ఆదుకోవడం వల్లే చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, ఎక్స్ అఫీషియో మూడు ఓట్లలో రెండు ఓట్లు రేపు శ్రీకాకుళం మున్సిపాలిటీకి అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లో శ్రీకాకుళం మురపాలక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం పట్టణంలో బలంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు టీడీపీకి గట్టిగా బుద్ది చెప్పే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో శ్రీకాకుళం పురపాలక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం అయితే రానున్న ఎన్నికల్లో ఆరుమాసాల్లోగా పూర్తయితే వీరి ఓట్లు చెల్లవు. నిన్నటి వరకు ఇదే సందేహంతో ఉన్న టీడీపీ ఎక్స్ అఫీషియో సభ్యులు.. ఎలాగైనా ఆమదాలవలస చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరు సహకరించక పోతే ఆమదాలవలస చైర్మన్ పీఠం వైఎస్‌ఆర్‌సీపీకే దక్కేది.