'టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది'
హైదరాబాద్ : ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడరని ఆపార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టీడీపీలోకి వెళ్లడానికి చూస్తున్నారంటూ టీడీపీ దుర్మర్గమైన ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వస్తుందని ...శనివారం లేదా సోమవారం దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
రుణమాఫీపై టీడీపీ మీనమేషాలు లెక్కించటం తగదని ఉమ్మారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం రుణమాఫీ ఫైల్పై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. బాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు.
కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది లోక్‌సభ సభ్యులను గెలుచుకోవడమే కాకుండా 45 శాతం మేరకు ఓట్లు సాధించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది.