టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పోలిట్ బ్యూరో భేటీ అనంతరం ప్రకటించే అవకాశముంది.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పోలిట్ బ్యూరో భేటీ అనంతరం ప్రకటించే అవకాశముంది. టీడీపీకి రెండు స్థానాలు లభించే అవకాశం ఉండడంతో.. ఒక స్థానానికి పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. మరో స్థానం కోసం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున ్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు లేదా పార్టీ నేత బక్కని నర్సింహులు, సీమాంధ్ర నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణల్లో ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశమున్నట్టుగా చెబుతున్నారు.
మోత్కుపల్లి అభ్యర్థిత్వాన్ని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బక్కని నర్సింహులు పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఖర్చులు భరించేలా... నారాయణకు బెర్తు ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఆయనకు అవకాశం దక్కనిపక్షంలో.. మాజీ స్పీకర్ కె.ప్రతిభాభారతి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్టీ నేత దాసరి రాజామాస్టార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.