టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
మద్దికెర : ప్రస్తుత టీడీపీ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం మద్దికెరలో మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డిప్యూటీ సీఎం ఉన్నా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ప్రజలు నిత్యం సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆరోపించారు. వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తే జిల్లాలోని అన్ని గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. కానీ అందుకు విరుద్దంగా అధికార పార్టీ నాయకులు నీటిని, ఇసుకను అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిదన్నారు. రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ, అందరికి ఇళ్లు తదితర హామీలను ఇచ్చిన టీడీపీ వాటి అమలు మరిచిపోయిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కూడా ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని పార్టీ మండల నాయకులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ సుధాకర్, ఉపసర్పంచ్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.