చివరి మూడు గంటల్లో టీడీపీ రౌడీ రాజకీయం
సాక్షి, నంద్యాల: పోలింగ్ సమయం తుది దశకు చేరుకోవండంతో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు. చివరి మూడు గంటల్లో రౌడీ రాజకీయానికి దిగారు. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్‌లు పోలింగ్ స్టేషన్లలో తిరగడం ప్రారంభించారు. చివరి మూడు గంటల్లో ఓట్లకోసం రౌడీ రాజకీయానికి పథకం వేశారు. పరిమితికి మించి అనుచరులను వెంటేసుకొని తిరుగుతున్నా కనీసం పోలీసులు పట్టించుకోనుకుడా పట్టించుకోలేదు.
అనంతరం తెలుగుదేశం నేతలు, అనుచరులు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుఉడు రాజగోపాల్‌పై దాడులకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మనుషులు రాజగోపాల్ రెడ్డిపై దాడిచేశారు. మరోవైపు ఏడోవార్డులో డబ్బుల పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు. ఇష్టారీతిగా కొడుతూ ‘‘మేం మిమ్మల్ని కొట్టిన విషయం ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని ఏవీ సుబ్బారెడ్డి దూషించారు. కాగా ఈ వ్యవహారంలో టీడీపీకి వత్తాసుగా ప్రేక్షపాత్ర వహించిన పోలీసుల తీరును శిల్పా ప్రశ్నించారు.
దొంగ ఓట్లు వేయడానికి ఇతర నియోజక వర్గాలనుంచి పెద్దఎత్తున మనుషులను పిలిపించారు. నందమూరి నగర్‌లో దొంగ ఓట్లకు ప్రయత్నిస్తున్న 45 మందిని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులుకు అప్పగించారు. మరో 30 మంది పరారయ్యారు. వైఎస్సార్సీపీకి పట్టున్న వైఎస్సార్ నగర్‌లో అంగన్ వాడీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి స్లిప్పులు ఇచ్చిమరీ పంపిచారు. అయితే వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ శ్రేణులు వారిని అడ్డుకున్నాయి.