డ్వాక్రా మహిళల ఇళ్లకు అంటించిన స్టిక్కరు
విజయనగరం, నెల్లిమర్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం విచిత్రమని ముక్కున వేలేసుకుంటున్నారు. మనం మేలుచేస్తే ఎవరైనా సరే వారే స్వయంగా కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మాత్రం వింతగా ఉంది. సీఎం చంద్రబాబు గోరంత చేసి కొండంత గొప్పలు చెప్పుకోవడమే కాకుండా కోరి మరీ కృతజ్ఞతలు చెప్పించుకుంటున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం తీరుతో అధికారులు సైతం ఇబ్బందిపడుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీచేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు గాల్లో కలిపేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారని ఎదురుచూసిన మహిళలకు నిరాశే ఎదురైంది. రుణమాఫీ కాకపోవడంతో తీసుకున్న అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడి నిధి(పసుపు, కుంకుమ)పేరుతో ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు అందిస్తామని బాబుగారు ప్రకటించారు.
అది కూడా ఒకేసారి కాకుండా నాలుగు విడతలుగా విడుదల చేశారు. తాజాగా నాలుగో విడత రూ.2 వేలు విడుదలయ్యాయి. నెల్లిమర్ల నగరపంచాయతీ డ్వాక్రా మహిళలకు ఆ నిధులు నేటికీ అందలేదు. ఇక్కడ మొత్తం 323 సంఘాలకు పసుపు కుంకుమ నిధులు మంజూరయ్యాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. అయితే 299 సంఘాలకు చెందిన 3800మంది సభ్యులకు మూడు, నాలుగు విడతల మొత్తాలు జమకాలేదు. కేవలం 24 సంఘాలకు తాజాగా నాలుగో విడత నిధులు ఖాతాల్లో జమయ్యాయి. కానీ డ్వాక్రా మహిళలకు తామేదో ఒరగబెట్టినట్లు సీఎం డప్పు కొట్టుకుంటున్నారు. ‘ఆడపడుచులకు ధన్యవాదాలు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..సీఎం సర్‌కు ధన్యావాదాలు’ అనే స్టిక్కర్లను పంపిణీ చేసి ప్రతీ డ్వాక్రా మహిళ ఇంటికి అంటించమని ఆదేశించారు. అయితే నిధులే అందని మహిళల ఇళ్లకు స్టిక్కర్లు ఎలా అంటిస్తామని సంబంధిత సిబ్బంది, సంఘాల లీడర్లు వాపోతున్నారు. రుణమాఫీ చేయకపోగా ఇదేం సొంతడబ్బా అని గుసగుసలాడుకుంటున్నారు.
బలవంతంగా క్షీరాభిషేకాలు
స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ పెద్దల సంకేతాలతోనే ఆ విధంగా చేశారని సమాచారం. అందుకే ఇష్టం లేకపోయినా కాంట్రాక్టు అధ్యాపకులు ఆ కార్యక్రమం చేశారని సమాచారం. అక్టోబర్‌లో నిర్వహించిన మహా సంకల్పం కార్యక్రమంలో కూడా ఇదే విధంగా డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందితో సీఎం చిత్రపటానికి బలవంతంగా క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. ఇష్టం లేకపోయినా ఇలా అడిగి మరీ డప్పు కొట్టించుకుంటున్నారని నియోజకవర్గ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. కృతజ్ఞత అనేది మనసుల్లోంచి రావాలి కానీ ఇలా బలవంతంగా చెప్పించుకోవడమేమిటని పలువురు బహిరంగంగానే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment