టీడీపీ నాయకుడితో సర్వే రాయుడు
ఈ చిత్రం రామభద్రపురం మండలంలోని టీడీపీ కార్యాలయం. అక్కడున్నది ఒకరు సర్వేరాయుడు మరొకరు టీడీపీ నాయకుడు. రామభద్రపురంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఇటీవల సర్వే చేసేందుకు వెళ్లగా అక్కడి వారు తిరగబడడంతో స్థానిక నాయకుడు వచ్చి సర్వే రాయుడ్ని సమర్ధించి ఇదిగో ఇలా పార్టీ కార్యాలయంలో తన పక్కనే కూర్చోబెట్టారు. దీంతో సర్వే చేసిన వ్యక్తి తనను ఎదిరిస్తున్న విషయాలను అవసరమైన వారికి ఫోను చేస్తున్నాడు. సాక్షాత్తూ మంత్రి సుజయకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనిది ఈ సన్నివేశం. టీడీపీ నాయకులే ఓట్ల తొలగింపుకు సిద్ధపడ్డారన్న దానికి ఇంతకన్నా ఇంకేం ఉదాహరణ కావాలి.
విజయనగరం, బొబ్బిలి: ప్రత్యేక హోదా పోరాటం, యువభేరీ సదస్సులు, ప్రజా సంకల్పయాత్రతో జనం గుండెల్లో నిలిచిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేని అధికార పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయిలో సర్వేరాయుళ్లను దింపిన సంగతి తెల్సిందే. వారికి గ్రామస్థాయిలో సహకారం అందించింది కూడా స్థానిక టీడీపీ నాయకులే. వారి సహకారంతోనే గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ మీరు ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా? సమర్ధిస్తున్నారా అంటూ సర్వేలు చేసి మీ స్థానిక నాయకులెవరు అన్న వివరాలతో సంక్షిప్తం చేసిన సర్వే రాయుళ్లు ఇప్పుడు రోజుకు కొంత మంది చొప్పున వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లతోనే ఓటర్లను తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇంకొకరిపైన తొలగింపు దరఖాస్తులు ఇస్తే గొడవలవుతాయని ఈ సర్వే రాయుళ్లు కేవలం వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లనే తీసుకుని వారి పేరున తొలగింపు దరఖాస్తులు ఇస్తున్నారు. రోజూ రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ దరఖాస్తులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధికంగా శనివారం సాయంత్రానికి 8,743 ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి.
బొబ్బిలిలోని తెర్లాం, బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి మున్సిపాలిటీ మండలాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన ఓటర్ల పేరునే అధికంగా దరఖాస్తులున్నాయి. ఇందులో ఆ పార్టీకి చెందిన బూత్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఉత్సాహంగా పనిచేసేవారి పేరున తొలగించాలంటూ సర్వే రాయుళ్లు ఆన్‌లైన్ దరఖాస్తులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఇంకా రావచ్చంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ ఆన్‌లైన్ దరఖాస్తులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నాలుగు మండలాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు తొలగించమన్నట్టుగా వారి పేరున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విషయమై తహసీల్దార్లు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
టీడీపీ నాయకుల కుట్రలపై గవర్నర్,ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు..
వైఎస్సార్‌సీపీకి చెందిన ఓటర్లను కావాలనే తొలగించే టీడీపీ నాయకుల కుట్ర ఇది. గతంలో సర్వేరాయుళ్లను వివిధ పోలీసు స్టేషన్లకు అప్పగించినా వారిని చుట్టాల్లా వదిలేశారు. వైఎస్సార్ సీపీ జోరును చూసి తట్టుకోలేక అధికార పార్టీ చేస్తున్న ఈ దురాగతాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, బొబ్బిలి.
Comments
Please login to add a commentAdd a comment