జనస్వామ్యాన్ని, పరిణత జన మనోగతాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. అటు ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడటం... ఇటు అధికార యంత్రాం గాన్ని దుర్వినియోగం చేస్తూ విపక్షాలను బెదిరించడానికి వినియోగించుకోవడంవంటి పనులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ ప్రతినిధి బృందం ఈసీకి వివరించింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కుకు తూట్లు పొడవడానికి చంద్రబాబు, ఆయన పరివారం బరి తెగిస్తున్నారు. అందుకు వారనుసరిస్తున్న విధానాలు విస్మయం కలిగిస్తాయి. ఎంతో నిశితంగా పరి శీలిస్తే తప్ప వీటినెవరూ పోల్చుకోలేరు.
తెలుగుదేశం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఓటర్ల జాబితా మరింత ఆశ్చర్యకరమైనది. ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేవిధంగా వారి ఫొటోలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. నిజానికి ఎన్నికల సంఘం పార్టీలకిచ్చే జాబితాల్లో ఓటర్ల ఫొటోలుండవు. మరి ఈ ఫొటోల జాబితా టీడీపీకి ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘమే చెప్పాలి. ఓటర్ల జాబితాలను ఏమారుస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఒక సవాలుగా తీసుకుని పలు అక్రమాలను వెలికితీయగలిగాయి. ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారని అనుమానం వచ్చిన వారి పేర్లను రకరకాల సాకులతో అధికారుల ద్వారా తొలగింప జేయటం, అది వల్లకాకపోతే సర్వేల పేరిట ఇంటింటికీ యువకులను పంపి విపక్ష మద్దతుదార్లని నిర్ధారించుకున్నవారి ఓట్లను గల్లంతు చేయడం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు సెప్టెంబర్ నాటికి ఉన్న 52.67 లక్షల నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 60 లక్షలకు చేరుకుంది. ఈ ఓట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నమోదైన ఓట్లు 20 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు వేర్వేరు చోట్ల స్వల్ప మార్పులతో నమోదైన ఓట్లు మరో 20 లక్షలున్నాయి. అదే సమయంలో 4 లక్షలమంది నిజమైన ఓటర్ల పేర్లు మాత్రం జాబితానుంచి గల్లంతయ్యాయి. ఇంటింటికీ తిరిగి ఒక యాప్ ద్వారా ఓట్లను తొలగిస్తున్నవారిని పట్టుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా దిక్కూ మొక్కూ లేని దుస్థితి ఏర్పడింది. సహేతుకమైన నిరసనలను పలు సాకులతో అణచేస్తున్న పోలీసులకు ఈ అక్రమాలేవీ తప్పనిపించడం లేదు. సర్వే చేయడానికి ఎవరి కైనా హక్కుంటుందని, దాన్ని అడ్డగించకూడదని సుద్దులు వల్లిస్తున్నారు. యాప్ ద్వారా ఓట్లు తొల గించే ఈ సర్వేలకు అక్రమార్కులు పెడుతున్న పేర్లు కూడా చిత్రమైనవి. ప్రజాసాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్, పీరియాడిక్ సర్వే వంటి పేర్లతో ఈ మారీచకాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. విపక్షాలు ఓర్పుతో వ్యవహరించేంతవరకూ ఈ దొంగ సర్వేలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తాయి. కానీ వాటిని బుట్టదాఖలా చేస్తున్నారని గ్రహించుకుని, తామే తేల్చుకోవాలనుకుంటే... అవి ఘర్షణలకు దారితీస్తే అందుకు బాధ్యులెవరు?
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఎం తదితర 23 పార్టీల నాయకులతో పాటు చంద్రబాబు కూడా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం వీలు కాదు గనుక 50 శాతం ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్‌ల లోని రశీదులను లెక్కించి పోలైన ఓట్లతో వాటిని సరిపోల్చాలని వీరంతా కోరుతున్నారు. సలహా మంచిదే. కానీ తమ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న టక్కుటమార విద్యల గురించి వీరంతా తెలియనట్టు నటించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిరుడు ఆగస్టు నుంచి వీటి గురించి అన్ని వేదికల నుంచీ గళం విని పిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్న తీరును శాస్త్రీయంగా నిరూపిస్తోంది. ఈ 23 పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆప్, బీఎస్పీలకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాలు న్నాయి. కనుక జాతీయ నేతలకు అక్కడేం జరుగుతున్నదీ తెలియదనుకోవడానికి లేదు. అయినా ఒక్క పార్టీ నాయకులైనా చంద్రబాబును ‘మరి మీరు చేస్తున్నదేమిట’ని ప్రశ్నించినట్టు లేరు. తన విశ్వసనీయత గురించి చంద్రబాబుకు ఏనాడూ పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇతర పార్టీల నేతల కేమైంది? సొంత రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను భ్రష్టుపట్టిస్తున్న నాయకుడు తమతో ఉన్నందువల్ల ఎన్నికల సంఘం వద్ద నగుబాటు పాలవుతామని, తమ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతుం దని వీరెవ్వరికీ తోచలేదా?
పీడగా మారిన పాలకుల్ని విరగడ చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకుండే ఏకైక ఆయుధం ఓటు. దాన్ని కరెన్సీ నోట్లు విరజిమ్మి, అందుకు లొంగరనుకున్నవారి పేర్లు ఓటర్ల జాబి తాల్లో గల్లంతు చేయించి, రకరకాల మార్గాల్లో ఆ జాబితాలను నకిలీ ఓట్లతో నింపి చంద్రబాబు అండ్ కో చేస్తున్న పనులు అత్యంత గర్హనీయమైనవి. ఒకపక్క నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణనని చంద్రబాబు తరచూ గొప్పలు చెప్పుకుంటారు. ఈమధ్యకాలంలో బీజేపీపై అలుపె రగని పోరాటం చేస్తున్నానని స్వోత్కర్షకు పోతూ ఆయన అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. కానీ జరుగుతున్న అక్రమాలను, అధికార యంత్రాంగాన్ని బాహాటంగా దుర్వినియోగం చేస్తున్న తీరును ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను ప్రహసనప్రాయం చేయడానికి ప్రయ త్నించినవారిపై, వారు ఏ స్థాయివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండవు.
Published Wed, Feb 6 2019 12:13 AM | Last Updated on Wed, Feb 6 2019 12:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment