
సాక్షి, అమరావతి బ్యూరో: నిబంధనల ప్రకారం దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయ, అన్యమత ప్రచారం చేయకూడదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ అధికార తెలుగుదేశం నాయకులు మాత్రం విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తమ స్వామి భక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారందరూ ఎంతో భక్తిప్రవత్తులతో జరుపుకునే విజయవాడ శ్రీ కనకదుర్గా అమ్మ వార్ల దసరా మహోత్సవాల్లోనూ తెలుగు తమ్ముళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం దుర్గ గుడి, కొండ ప్రాంతం, గుడి టోల్‌గేట్, వినాయక టెంపుల్ వంటి ఆలయానికి సంబంధించిన ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయ, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచారాలు, ప్లె్లక్సీలు, కరపత్రాలు పంచడం వంటి కార్యక్రమాలు చేయకూడదు. కానీ దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు దర్శనానికి వెళ్లే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా ప్లె్లక్సీలు వెలిశాయి. మళ్లీ మీరే రావాలి..అంటూ చంద్రబాబు నాయుడు ఫోటోతో ప్లెక్సీలు కట్టారు.
పాలకమండలి సభ్యుడే ఇలా చేస్తే..
ఆలయ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకుని ముందు గుడి ప్రతిష్టతను కాపాడుతామని, ధార్మిక వాతావరణానికి ఇబ్బందులు రాకుండా క్రమశిక్షణతో పనిచేస్తామని ప్రమాణం చేసిన వ్యక్తే గీత దాటాడు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు పేరు మీద వినాయక టెంపుల్ నుంచి టోల్ గేట్ రాజగోపురం వరకు ఫ్లెక్సీలు వెలిశాయి. మళ్లీ మీరే రావాలి..అంటూ చంద్రబాబు ఫోటో కింద పాలకమండలి సభ్యుడి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలు అమలు చేయాల్సిన సభ్యుడే వాటిని అతిక్రమించడంపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పట్టించుకోని యంత్రాంగం
భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రచార ఫ్లెక్సీలు కట్టినప్పటికీ దేవస్థాన యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారం పక్షానికి సంబంధించిన వ్యక్తి కావడం, పైగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫ్లెక్సీ పెట్టడం చేతనో ఏమోగాని యంత్రాంగం ఆ ఫ్లెక్సీలను చూసీచూడనట్లు వదిలేశారు. ఇలా ఆలయ ప్రతిష్టను మంటగలిపే కార్యక్రమాలు జరుగుతున్నా యంత్రాంగం మిన్నుకుండటంపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భక్తుల ఆగ్రహం
ప్రతి పనిని ప్రచారానికి వాడుకోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గ్రామదర్శిని, జన్మభూమి, జ్ఞానభేరి వంటి ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా దాన్ని ప్రచారానికి వాడుకోవడం అధి కారపార్టీ నేతలకు సర్వసాధారణమైంది. కానీ ధార్మిక విషయాల్లో కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం భక్తులకు తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇటువంటి నీచ రాజకీయాలు కనీసం పండుగ సమయాల్లోనైనా మానుకోవా లని హితవుపలికారు. పాలకమండలిలో ఉంటూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే పదవిలోంచి తీసేయాలని కోరుతున్నారు. దేవస్థానం ఈవో వెంటనే స్పందించి వాటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment