గాయాలతో సాయితేజ వీపుపైన తట్లు తేరిన దృశ్యం
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని డీఈవో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విద్యార్థి పి.సాయితేజస్వామి శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. పాఠశాల పనివేళలు ముగిసిన తరువాత స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాగా, 6.30 గంటల సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అంధకారంగా ఉండడంతో విద్యార్థులంతా పెద్దగా కేకలు పెట్టారు. విద్యార్థులను పక్కనే ఉన్న వేరొక గదిలోని తీసుకెళ్లి అక్కడ జనరేటర్ సౌకర్యం ఉండడంతో స్టడీ అవర్స్ తిరిగి నిర్వహించారు.
ఆ సమయంలో ఇంగ్లిషు ఉపాధ్యాయుడు సునీల్ వచ్చి సాయితేజను విద్యుత్ అంతరాయం కలిగినపుడు ఎందుకు గట్టిగా అరిచావని కర్రతో కొట్టాడు. తాను కాదని మొరపెట్టుకొంటున్నా తోటి విద్యార్థులు చెబుతున్నా వినకుండా వేరొక గదిలోకి తీసుకెళ్లి తలుపులు బిగించి ఇష్టారాజ్యంగా తట్లు తేరేటట్లు కర్రతో బాదేశాడు. తిరిగి స్టడీ అవర్ గదిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. 8 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులంతా వెళ్లిపోగా విద్యార్థులంతా బయటకు వచ్చి అటుగా వెళుతున్న ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ తీసుకొని సాయితేజ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ సాయితేజను వారి తల్లిదండ్రుల షాపు వద్దకు తీసుకెళ్లి వదిలాడు. తీవ్రంగా గాయపడిన సాయితేజకు చికిత్స చేయించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించి తల్లిదండ్రులు రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment