sri chaithanya school
-
దుర్భాషలాడిన శ్రీచైతన్య ఉపాధ్యాయుడు..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు కల్చరల్ : బొల్లవరంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని దుర్భాషలాడారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం పాఠశాలలో ఆందోళనకు దిగారు. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తనకు పరీక్షలో తక్కువ మార్కులు వేశారని కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు శంకర్‌ను ప్రశ్నించింది. దీనిని మనసులో ఉంచుకుని ఆ ఉపాధ్యాయుడు ప్రతి దానికి వేధిస్తున్నారని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పాఠశాలలో ఆందోళన చేశారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వేశారని ప్రశ్నించినందుకు కక్ష సాధింపుగా.. అల్లరి చేస్తోందన్న నెపంతో విద్యార్థినిని చెప్పుతో కొడతా అని తనకు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు. దీంతో విద్యార్థిని ఇంట్లో ముభావంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఉపాధ్యాయుడు, యాజమాన్యాన్ని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడితే ఎలా అని, ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి అని వారిని ప్రశ్నించారు. వేలకు వేలు ఫీజులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థినికి క్షమాపణ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయున్ని తొలగిస్తామని పాఠశాల ఏజీఏం నాగిరెడ్డి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎంఈఓ సావిత్రమ్మ శ్రీచైతన్య పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించారు. విద్యార్థినితో మాట్లాడి సమాచారం సేకరించారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఎంఈఓ చెప్పారు. -
ప్రిన్సిపాల్ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : సెల్ఫోన్లు ఉన్నాయనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ విద్యార్థులను దారుణంగా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ముందే విద్యార్థులను చితకబాదడం గమనార్హం. పదో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులను అనుమానంతో హింసించడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జయమని కంఠేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, స్కూలు యాజమాన్యాన్ని నిలదీయగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
విద్యార్థి చేయి విరగ్గొట్టిన ‘శ్రీచైతన్య’ టీచర్
ఎమ్మిగనూరు టౌన్: అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదన్న కోపంతో శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుడొకరు ఓ విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. బాధిత విద్యార్థి తండ్రి కరీం, విద్యార్థి సంఘాల నాయకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణానికి చెందిన అబ్దుల్ కలాం అనే విద్యార్థి ఎమ్మిగనూరు లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని విద్యార్థి అబ్దుల్‌కలాంను సైన్స్ ఉపాధ్యాయుడు జమీల్ చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. దీంతో చేయి విరిగింది. అతన్ని తల్లిదండ్రులు చిన్నతుంబళం గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. శుక్రవారం విద్యార్థి తండ్రితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు వీరే‹Ùయాదవ్, ఉసేని, మహేంద్రబాబు పాఠశాల వద్దకు చేరుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్సతో పాటు చదువుకయ్యే ఖర్చు భరించాలన్నారు. చివరకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు. -
రాత్రి సీజ్.. పొద్దున్నే పర్మిషన్
సాక్షి, కందుకూరు రూరల్: నిబంధనలకు విరుద్దంగా పబ్లిక్ సెలవు దినాల్లో పాఠశాలలను నడుపుతున్న రెండు ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి బి.శివన్నారాయణ పరిశీలించి సీజ్ చేశారు. సీజ్ చేసిన తాళాలను జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం రాత్రే అందజేశారు. అయితే తెల్లవారే సరికి డీఈఓ నుంచి అనుమతులు వచ్చాయని పాఠశాలలను యథావిధిగా నడుపుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు సీజ్ చేసిన తాళాలను తీయకుండా గేటుకు ఉన్న చిన్న గేటు నుంచి పాఠశాలను నడిపారు. నారాయణ పాఠశాల అయితే శనివారం మధ్యాహ్ననాకి డీఈఓ అనుమతులు ఇచ్చారని తాళాలు కూడా ఇచ్చారని మధ్యాహ్నం నుంచి పాఠశాలను ప్రారంభించారు. అయితే శుక్రవారం పాఠశాలలను సీజ్ చేసి ఎంఈఓ రాత్రికి డీఈఓకు తాళాలు అందజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకుంటాయి. పాఠశాలలను మాత్రం 9 గంటలకే ప్రారంభిస్తారు. అయితే డీఈఓ అనుమతులు ఇచ్చారని సీజ్ చేసిన తాళాన్ని కూడా తీయకుండా శ్రీచైతన్య పాఠశాల తరగతులను నడిపింది. రాత్రికి రాత్రే అనుమతులు డీఈఓ అనుమతులు ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పూట కూడా గడవకముందే అనుమతులు ఇచ్చిన డీఈఓపై పలువురు విద్యావేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాల మధ్యాహ్నం వరకు పాఠశాల తెరవలేదు. మధ్యాహ్నం నుంచి డీఈఓ నుంచి అనుమతుల మేరకు తాళాలు తెచ్చుకున్నామని తాళాలు తెరచారు. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం విద్యాశాఖలో మండల అధికారిగా ఉన్న బి.శిన్నారాయణ పాఠశాలను పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారికి నివేదించి తాళాలు కూడా అప్పగించారు. అయితే తిరిగి సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుటు కనీసం ఎంఈఓకు కూడా తెలియకుండా అనుమతులు ఇవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి నిబద్ధతతో పని చేయడం... పై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలకే తాళాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ ఏమన్నారంటే ఎంఈఓ శిన్నారాయణను వివరణ కోరగా సీజ్ చేసి ఉంటే పాఠశాలలు ఎలా తీశారని పాఠశాల ప్రిన్సిపాల్స్‌ను అడగగా డీఈఓ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెప్తున్నారు. శ్రీచైతన్య అయితే పాఠశాల నడుపుకోండి తర్వాత తాళాలు వచ్చి తీసుకెళ్లండని డీఈఓ చెప్పారని వారు సమాధానం ఇచ్చారని ఎంఈఓ తెలిపారు. సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా అధికారి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. డీఈఓ వివరణ ఏంటంటే.. ఈ విషయమై డీఈవో సుబ్బారావును వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ సెలవు రోజైన కృష్ణాష్టమి రోజున తరగతులు నిర్వహిస్తున్నందున కందుకూరులోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలను శుక్రవారం ఎంఈవో పరిశీలించి సీజ్ చేశారన్నారు. అయితే ఆయా పాఠశాలల నిర్వాహకులు మరోసారి ఇలాంటి పొరపాటు చేయబోమని ప్రాధేయపడటంతో శనివారం స్కూలు నిర్వహించుకోవాలని చెప్పామన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓకు తెలియజేయడంలో సమాచార లోపం జరిగిందని పేర్కొన్నారు. -
టీచర్ ప్రాణం తీసిన శిక్షణ!
కర్నూలు సిటీ: ఆరోగ్యం సరిగా లేదు...శిక్షణకు రాలేనని ఓ ప్రైవేటు ఉపాధ్యాయిని యాజమాన్యా నికి విన్నవించింది. ఆమె గర్భిణి అయినా యాజమాన్యం కనికరించలేదు. దీంతో అనారోగ్యంతోనే ఎండలో శిక్షణ హాజరై ప్రాణాలు కోల్పోయింది. నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవే టు టీచర్స్ అసోసియేషన్ నాయకుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థ తమ ఉపాధ్యాయులకు నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న సుధారాణి (28) హాజరైంది. ఆమె మూడు నెలల గర్భిణి. దీనికితోడు అనారోగ్యంగా ఉండడంతో తాను శిక్షణకు రాలేనని చెప్పినా నిర్వాహకులు వినలేదు. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో చేసేది లేక శిక్షణకు వచ్చారు. బుధవా రం రాత్రి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అబార్షన్ అయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం శిక్షణ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో శిక్షణ ఎ లా నిర్వహిస్తారని సంఘం రాష్ట్ర కన్వీనర్ చాంద్‌బాషా ప్రశ్నించారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా దుర్మార్గంగా వ్యవహరించిన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. అడ్మిషన్లు, వర్క్‌షాప్ పేరుతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో నాయకులు చక్రపాణిరెడ్డి, నాగరాజు, మహేష్, ప్రసాద్, వీరేష్, హనుమంతురెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ప్రైవేటు టీచర్ల సంఘం నాయకులు -
శ్రీచైతన్యలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు!
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని డీఈవో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విద్యార్థి పి.సాయితేజస్వామి శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. పాఠశాల పనివేళలు ముగిసిన తరువాత స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాగా, 6.30 గంటల సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అంధకారంగా ఉండడంతో విద్యార్థులంతా పెద్దగా కేకలు పెట్టారు. విద్యార్థులను పక్కనే ఉన్న వేరొక గదిలోని తీసుకెళ్లి అక్కడ జనరేటర్ సౌకర్యం ఉండడంతో స్టడీ అవర్స్ తిరిగి నిర్వహించారు. ఆ సమయంలో ఇంగ్లిషు ఉపాధ్యాయుడు సునీల్ వచ్చి సాయితేజను విద్యుత్ అంతరాయం కలిగినపుడు ఎందుకు గట్టిగా అరిచావని కర్రతో కొట్టాడు. తాను కాదని మొరపెట్టుకొంటున్నా తోటి విద్యార్థులు చెబుతున్నా వినకుండా వేరొక గదిలోకి తీసుకెళ్లి తలుపులు బిగించి ఇష్టారాజ్యంగా తట్లు తేరేటట్లు కర్రతో బాదేశాడు. తిరిగి స్టడీ అవర్ గదిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. 8 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులంతా వెళ్లిపోగా విద్యార్థులంతా బయటకు వచ్చి అటుగా వెళుతున్న ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ తీసుకొని సాయితేజ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ సాయితేజను వారి తల్లిదండ్రుల షాపు వద్దకు తీసుకెళ్లి వదిలాడు. తీవ్రంగా గాయపడిన సాయితేజకు చికిత్స చేయించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించి తల్లిదండ్రులు రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు. -
ప్రారంభానికి ముందే పడిపోయింది
ప్రొద్దుటూరు కల్చరల్ : ప్రారంభానికి ముందే పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల భవన ముందు భాగం కూలిపోయింది. ఆదివారం వర్షం కురిసిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో పాఠశాల భవన నిర్మాణాల్లో నాణ్యత బట్టబయలైందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. విద్యా శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా బొల్లవరంలో నూతనంగా శ్రీచైతన్య పాఠశాల ఏర్పాటు చేశారు. దీన్ని ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి పాఠశాల ముందుభాగం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాఠశాల ప్రారంభమై విద్యార్థులు ఉంటే పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు నాణ్యతను పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉపవిద్యాశాఖాధికారి పెంచలయ్యను వివరణ కోరగా మంగళవారం పాఠశాలను పరిశీలిస్తానని తెలిపారు. అధికారులు చర్య తీసుకోవాలి శ్రీచైతన్య పాఠశాలకు అనుమతి ఇచ్చే ముందు అధికారులు భవనాన్ని పరిశీలించాలి. లోపాలు ఉంటే పాఠశాలకు అనుమతి ఇవ్వొద్దు. విద్యార్థులు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. – మస్తాన్,ఏఐఎస్బీ రాయలసీమ కన్వీనర్, ప్రొద్దుటూరు -
హోం వర్క్ చేయలేదని..
- విద్యార్థిని చితకబాదిన టీచర్ - ఆందోళనకు దిగిన విద్యార్థి తల్లిదండ్రులు ధర్మవరం టౌన్ : హోం వర్క్ చేయలేదని విద్యార్థి భుజం కందిపోయేలా చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ ఉదంతం ధర్మవరంలో వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు... పట్టణంలో పట్టుచీరల వ్యాపారి ఆదినారాయణ కుమారుడు చరణ్‌తేజ్ శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. మంగళవారం ఉదయం చరణ్‌తేజ్ హోం వర్క్ చేసుకురాలేదని టీచర్ కవిత కర్రతో భుజంపై ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దెబ్బలకు ఆ ప్రాంతం కందిపోయి, వాతలు పడ్డాయి. భయపడిపోయిన చరణ్ సాయంత్రం ఇంటికెళ్లాక టీచర్ కొట్టిన దెబ్బలను తల్లిదండ్రులకు చూపించాడు. అప్పటికే జ్వరం ఎక్కువగా ఉండటంతో అనంతపురం తీసుకువెళ్లి చికిత్స చేయించారు. బుధవారం ఉదయం శ్రీచైతన్య పాఠశాల ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నపిల్లాడని చూడకుండా గొడ్డుని బాదినట్టు బాదుతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తమ కుమారుడి లాగా ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాదని హామీ ఇవ్వాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై ఆందోళనలను ఉ«§lతం చేస్తామని ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి.