ఒక్కరితో కష్టమే.. | Teacher Shortage in YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఒక్కరితో కష్టమే..

Published Wed, Oct 2 2019 12:43 PM | Last Updated on Wed, Oct 2 2019 12:43 PM

Teacher Shortage in YSR Kadapa - Sakshi

కడపలోని ఉర్దూ పాఠశాలలో సింగల్‌ టీచర్‌ సెలవు పెట్టడంతో పాఠాలను బోధిస్తున్న సీఆర్‌పీ

కడప ఎడ్యుకేషన్‌: విద్యార్థి దశలో ప్రాథమిక విద్య అతి ముఖ్యౖమైనది. చదువు పరంగా బలమైన పునాది పడేది అక్కడే. అయితే నేటికి జిల్లాలో 485 చోట్ల ఏకోపాధ్యాయుడు పనిచేస్తున్నాడంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి వచ్చింది. 435  తెలుగు మీడియం పాఠశాలలు, 50 ఉర్దూ మీడియం పాఠశాలలకు ఏకోపాధ్యాయుడే దిక్కు.

విద్యాహక్కుచట్టం ప్రకారం..
విద్యాహక్కుచట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. పది మంది లోగా విద్యార్థులుంటే ఆ పాఠశాలలను పూర్తిగా మూసి వేయడం, 19 మంది వరకు విద్యార్థులుంటే ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. 19 మంది కంటే ఎక్కవ విద్యార్థులుంటే మాత్రం కచ్చితంగా ఇద్దురు ఉపాధ్యాయులను ఇవ్వాలి. కానీ చాలా పాఠశాలలలో ఈ సంఖ్యకు మంచి విద్యార్థులున్నా  ఏకోపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నాడు. 

అమ్మఒడితో పెరిగిన విద్యార్థుల సంఖ్య..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టన వెంటనే పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిని సారించారు. దీంతోపాటు పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులందరి ఖాతాలకు ప్రతి ఒక్కరికి రూ. 15 వేలు వేస్తామనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. కాగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వం డీఎస్సీ కచ్చితంగా నిర్వహిస్తుందని.. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తుందని ఆశతో ఉన్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరంలో టీచర్ల కొరత తీరే అవకాశం ఉంది.

ఈ పక్కనున్న పట్టికలోని పాఠశాలలతో పాటు  జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 మంది విద్యార్థులున్న పాఠశాలలు 60 దాకా ఉన్నాయి. వీటిలో కూడా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నాడు. ఈ పాఠశాలల పనిచేసే ఉపాధ్యాయుడు అత్యవసర పనిపైన  బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం పాఠశాలలను మూసి వేయాలి లేదా పక్క పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికో లేక ఆ మండలంలో పనిచేసే పీఆర్‌సీకో బాధ్యతలను అప్పగించి సెలవు పెట్టాలి.

విద్యావలంటీర్లను ఏర్పాటు చేస్తాం...
జిల్లాలో సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లను ఏర్పాటు చేస్తాం.   జిల్లాలో ఈ ఏడాది కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఒక్క టీచర్‌ బోధించడం కష్టతరం. పెరిగిన పాఠ శాలలకు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి జాబితాను పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే  వలంటీర్లను ఏర్పాటు చేస్తాం.  
– శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement