
తప్పతాగి ప్రభుత్వ ఉపాధ్యాయుడి వీరంగం..
రెంటచింతల (గుంటూరు) : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తప్ప తాగి పాఠశాలలో వీరంగం సృష్టించాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. పాఠశాలలో ఉన్న లోపాలు ఎవరికి కనిపించడం లేదా అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్ముడుకోట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న కేకేడీ ప్రసాద్ మద్యం మత్తులో లుంగీపై పాఠశాలకు వెళ్లాడు.
ఏకోపాధ్యాయుడు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు అంతా ఆడుకుంటుండగా.. ఉపాధ్యాయుడు మాత్రం రోడ్డు పక్కన చైర్ వేసుకుని కూర్చున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఇక్కడ గాలి బాగా వీస్తోందని కూర్చున్నానంటూ సమాధానం ఇచ్చాడు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు లుంగీపైనే పాఠశాలకు హాజరయ్యాడని గుర్తించి ఎమ్‌ఈవోకు సమాచారం అందించారు. కాగా.. గతంలో కూడా ఉపాధ్యాయుడి తీరు సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2012 సంవత్సరంలో నిధుల దుర్వినియోగం పై అధికారులు సస్పెన్షన్ విధించినా తీరు మార్చుకోలేదని వాపోతున్నారు.