నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ :
వారు బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు. అయితే వారే విధులకు డుమ్మా కొడుతూ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. ఒకరోజో రెండు రోజులో కాదు ఏకంగా నాలుగేళ్లుగా పాఠశాల ముఖమే చూడని ఉపాధ్యాయులున్నారు. ఇలా పది మంది టీచర్లు విధులకు దూరంగా ఉంటున్నా రు. జిల్లాలో 1,536 ప్రాథమిక, 262 ప్రాథమికోన్నత, 478 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 10 వేల మంది టీచర్లు పని చేస్తున్నారు. పది మంది టీచర్లు నాలుగేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. వీరికి నోటీసులు ఇచ్చి, ఉద్యోగం నుంచి తొలగించడానికి విద్యాశా ఖ కసరత్తు చేస్తోంది. నోటీసులకు ఎవరైనా స్పందించి వస్తే విధుల్లోకి తీసుకుంటారు. లేకపోతే కలెక్టర్ అనుమతితో గజిట్‌లో ఉంచి ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
నాలుగేళ్లకు వచ్చిన ఫిర్దోస్
ఎల్లారెడ్డిలోని బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు ఫిర్దోస్ అనధికారిక సెలవులో ఉన్నారు. ఆమె 2009 జూన్ 21 నుంచి విధులకు రావడం లేదు. విద్యాశాఖ అధికారులకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నాలుగేళ్ల తర్వాత ఆమె ఈనెల మూడో తేదీన పాఠశాలకు వచ్చారు. అయితే తన పరిధిలో లేనందున ఆయన ఎంఈఓను కలవాలని సూచించారు. ఎంఈఓ డిప్యూటీ ఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఈఓను కలవాలన్నారు. ఏడాదిలోపు వచ్చేవారినే విధుల్లోకి తీసుకునే అధికారం తనకుందని డీఈఓ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌ను పాఠశాల డెరైక్టర్‌కు పంపుతున్నారు. ఈమెలాగే మరికొందరు ఉండి ఉంటారని అనుమానించిన డీఈఓ శ్రీనివాసాచారి.. అనధికారికంగా సెలవులో ఉంటున్న టీచర్ల వివరాలు పంపాలని ఎంఈఓలను ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆరుగురు టీచర్లకు సంబంధించిన నివేదికలు అందాయి. ఎంఈఓల వద్ద మరో నలుగురు టీచర్ల వివరాలున్నాయి. వీరికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో నోటీసుల జారీ చేస్తామని డీఈఓ తెలిపారు. వాటికి స్పందన రాకుంటే కలెక్టర్ అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది లాంగ్ లీవ్‌లో ఉన్న ఎనిమిది మంది టీచర్లను, 2011లో 14 మంది టీచర్లను విధుల నుంచి తొలగించారు.
నాలుగేళ్లుగా కనిపించని టీచర్లు
Published Mon, Dec 16 2013 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement