వండవదొరకు కన్నీటి వీడ్కోలు  | Tearful Farewell To Narasimha Rao Dora Srikakulam District | Sakshi
Sakshi News home page

వండవదొరకు కన్నీటి వీడ్కోలు 

Published Wed, Aug 21 2019 8:46 AM | Last Updated on Wed, Aug 21 2019 10:09 AM

Tearful Farewell To Narasimha Rao Dora Srikakulam District - Sakshi

వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, ప్రజల మనిషి విశ్వాసరాయి నరసింహరావుదొర(95) అంతిమ వీడ్కోలు స్వగ్రామం వీరఘట్టం మండలం వండవలో మంగళవారం జనసందోహం మధ్య నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఐదుగురు కుమార్తెలు, కుమారుల కుటుంబ సభ్యులు సుమారు 80 మంది తరలివచ్చి వండవదొర పార్థివదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. భార్య శాంతకుమారి, చిన్న కుమార్తె, ప్రస్తుత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఇతర కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

జనసంద్రమైన వండవ..
అజాత శత్రువుగా పేరున్న వండవదొర పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన రాజకీయ ప్రముఖులు, బంధువులు, గిరిజన సంఘం నాయకులు, అధికారులతో వండవ జనసంద్రంగా మారింది. అంత్యక్రియల్లో పాల్గొని వండవదొర అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ నిమ్మక పాండురంగ, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు తరలివచ్చి వండవదొరకు కన్నీటి వీడ్కోలు పలికారు.

మామిడితోటలో అంత్యక్రియలు....
వండవదొర కోరిక మేరకు ఆయన మామిడితోటలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు లక్ష్మణరావు తలకొరివి పెట్టగా చిన్నల్లుడు మండంగి హరిప్రసాద్, మనవడు కుమిధిన్, తమ్ముడు లక్ష్మీనారాయణదొర, అతని పిల్లలు అంత్యక్రియలు పూర్తి చేశారు.

భారీ బందోబస్తు..
వండవదొర భౌతిక కాయాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు తరలిరావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలకొండ డీఎస్పీ రారాజుప్రసాద్, సీఐ ఆదామ్‌ ఆద్వర్యంలో వీరఘట్టం, పాలకొండ, రేగిడి, సీతంపేట ఎస్‌ఐలు గట్టిపోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మంత్రుల పరామర్శ..
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కుటుంబాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా ఇన్‌చార్జి మంత్రి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లు పరామర్శించారు. వీరితో పాటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాసరావు  తదితరులు వండవదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వండవదొర కుటుంబ నేపథ్యాన్ని పాలవలస విక్రాంత్‌ వివరించారు. అంతకుముందు అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement