- మానుకోట రైల్వేస్టేషన్‌లో మొరాయించిన ఇంజిన్
- మరో ఇంజిన్ జోడించిన సిబ్బంది
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు మానుకోట రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం గంట పదిహేను నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ మానుకోట రైల్వేస్టేషన్‌కు డౌన్‌లైన్‌లో 10.16 నిమిషాలకు చేరుకుంది. తర్వాత డ్రైవర్ స్టార్ట్ చేయబోగా ఇంజన్ మెరాయించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై డోర్నకల్ రైల్వేస్టేషన్ నుంచి మరో ఇంజన్‌ను మానుకోట రైల్వేస్టేషన్‌కు తెప్పించారు.
ఆ ఇంజన్‌ను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు జోడించి ఇంటర్‌సిటీ రైలును పంపిన తర్వాత కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును పంపించారు. సాంకేతిక లోపంతో రైలు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లో క్యాంటీన్ కూడా లేకపోవడంతో తినుబండారాల కోసం స్టేషన్ పరిసర ప్రాంతంలో దుకాణాలకు వెళ్లి వాటర్ బాటిళ్లు, ఇతరాత్ర తినుబండారాలు కొనుగోలు చేశారు.