సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు. ఐదేళ్ల పాలనపై తీర్పు చెప్పడానికి ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా.. నీ ఓటు ఉందా? పోయిందా? అనే ప్రశ్నతోనే పలకరింపులు మొదలవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓటు వేద్దామని ఉత్సాహంగా ఎదురు చూస్తే ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమైంది. ప్రతిపక్షానికి మద్దతుదార్లు, సానుభూతిపరులన్న అనుమానం ఉన్నవారి ఓట్లను తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఇంకెవరో మాయగాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వేలాది ఓట్లపై వేటు వేసింది. విషయం తెలుసుకుని ఓటర్లు నిర్ఘాంతపోతున్నారు. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అందులో తమ పేరు కనిపించక లబోదిబోమంటున్నారు. మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుందామంటే సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది. మరోవైపు ఓట్ల నమోదు గడువు ఇక రెండు రోజులే మిగిలి ఉండడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
18 ఏళ్లు నిండిన వారికీ దక్కని ఓటు హక్కు
ఓటర్ల జాబితాను పరిశీలించడానికి, అందులో పేరు లేకపోతే మళ్లీ ఓటు హక్కు పొందడానికి చాలామంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఓటు ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కొత్త ఓటును నమోదు చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. ఉదయం నుంచి ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఓటు నమోదు చేసుకోలేకపోతున్నామని జనం వాపోతున్నారు. కొన్నిజిల్లాల్లో సైట్ ఓపెన్ అవుతోందని కానీ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారిగా సర్వర్ డౌన్ అవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు నిండినవారు దాదాపు 19 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో చాలామంది ఇంకా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నా సాంకేతిక సమస్యల వల్ల ఫలితం లేకుండాపోతోంది. ఓటు హక్కు పొందాలని ఆసక్తి చూపిస్తున్నా ఆన్‌లైన్‌లో సాంకేతిక అవరోధాలు ఎదురవుతుండడంతో జనం నిరాశకు గురవుతున్నారు.
గడువు పెంచాలని విజ్ఞప్తులు
‘‘ఓటు ఉందో లేదో వెంటనే చూసుకోండి, కొత్తగా ఓటరు నమోదుకు మార్చి 15వ తేదీ వరకే గడువు ఉంది, ఈలోగా నమోదు చేసుకోకపోతే పోలింగ్ తేదీన వచ్చి ఓటు లేదంటే మేము ఏమీ చేయలేం’’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. దీంతో చాలామంది ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసి చెప్పండంటూ నేరుగా పత్రికా కార్యాలయాలకే ఫోన్లు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సర్వర్ పనిచేయడం లేదని, తక్షణమే సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఓటు నమోదుకు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం వీలుకాకపోతే, వెంటనే ఫారం–6 పూర్తి చేసి, సంబంధిత బూత్ లెవల్ అధికారికి(బీఎల్‌ఓ) గానీ, తమ కార్యాలయంలో గానీ అందజేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.
ఓటు నమోదుకు తప్పని తిప్పలు
విజయనగరం జిల్లాలో ఓటర్ నమోదుకు దరఖాస్తులు వెల్లువలా రావడంతో బుధవారం ఎన్నికల సంఘం వెబ్‌సైట్ చాలాసేపు స్తంభించిపోయింది. ఓటర్ నమోదుకు ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో ఇప్పటికే భారీ సంఖ్యలో ఓట్లను రద్దు చేశారు. ఓటరు నమోదుకు ఆన్‌లైన్‌లో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్ స్తంభించిపోతోందని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి చెప్పారు.
‘1950’కు ఫిర్యాదు చేసినా...
శ్రీకాకుళం జిల్లాలో ఓటు నమోదుకు ఆన్‌లైన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫారం–6 నింపి, అప్‌లోడ్ చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. జిల్లాలోని పలువురు ప్రజలు బుధవారం ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆన్‌లైన్‌లో ఫారం–6 నింపుతుండగా, ఫోటో అప్‌లోడ్ చేస్తుండగా సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్‌లోడ్ కావడం లేదు. దీనిపై ‘1950’కు ఫిర్యాదు చేయడం కూడా సాధ్యం కావడం లేదు.
మీ–సేవా కేంద్రాల వద్ద జనం బారులు
వైఎస్సార్ జిల్లాలో సర్వర్ పనిచేయక ఓటర్ల నమోదుకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల దరఖాస్తులు చేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో ఓపికగా నిల్చుని, చివరకు చేసేది లేక వెనక్కి వచ్చారు. జిల్లా కేంద్రమైన కడపలో చాలామంది దరఖాస్తు చేసుకోవాలని వచ్చినా సర్వర్ పనిచేయకపోవడంతో వెనుతిరిగారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది దరఖాస్తు చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా మీ–సేవతోపాటు ఏపీ ఆన్‌లైన్, ఇంటర్నెట్ కేంద్రాల్లో సర్వర్ సమస్యతో అవస్థలు పడ్డారు.
ఫారం–6 ఎవరికి సమర్పించాలో..
నెల్లూరు జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ–సేవ, ఇంటర్నెట్ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. రాత్రి పది గంటల తర్వాత మాత్రమే సైట్ ఓపెన్ అవుతోంది. వివరాలు అప్‌లోడ్ అయ్యేలోగా కట్ అయిపోతోంది. మళ్లీ మొదటి నుంచీ చేసుకోలేక జనం మిన్నకుండి పోతున్నారు. ఇంకోవైపు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఫారం–6 దరఖాస్తులను సమర్పించాలో తెలియడం లేదని జనం అంటున్నారు.
రెండురోజులుగా పెండింగ్‌లోనే దరఖాస్తులు
కృష్ణా జిల్లాలో ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సర్వర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. జిల్లావ్యాప్తంగా రోజుకు 2000లకు పైగా ఫారం–6 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో 4,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.
చేతులెత్తేస్తున్న అధికారులు
కర్నూలు జిల్లాలో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు సర్వర్ చిక్కులు వచ్చాయి. దరఖాస్తులను అప్‌లోడ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. మంగళవారం సర్వర్ కొంత మెరుగ్గా ఉండగా బుధవారం మొండికేసింది. తమకు అసలు ఓటు హక్కు వస్తుందా రాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్యను ఆర్‌వోలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా.. ఒత్తిడి పెరిగినందున పనిచేయడం లేదని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేదు
‘‘ఓటర్ల నమోదు ప్రక్రియకు గడువు దగ్గర పడుతోంది. ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్లు పనిచేయక జనం ఇబ్బందులు పడుతున్నారు. మీ–సేవా కేంద్రాలకు వెళ్లి, చాలాసేపు నిరీక్షించినా ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోలేక తిరిగి రావాల్సి వస్తోంది. ఈ సమస్య బుధవారం మరింత ఎక్కువగా ఉంది’’
– జి.ప్రదీప్‌కుమార్, రాజానగరం, తూర్పు గోదావరి జిల్లా
సర్వర్ డౌన్
Published Thu, Mar 14 2019 3:48 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment