అది పక్షపాత హింస | YSRCP Leaders complained to the Central Election Commission About TDP | Sakshi
Sakshi News home page

అది పక్షపాత హింస

Published Tue, Apr 16 2019 2:50 AM | Last Updated on Tue, Apr 16 2019 4:58 AM

YSRCP Leaders complained to the Central Election Commission About TDP - Sakshi

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ సందర్భంగా కొందరు ఉన్నతాధికారులు అధికార టీడీపీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించిన ప్రాంతాల్లోనే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్‌ సీపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులపై భౌతిక దాడులకు దిగారని బృందం ఈసీ దృష్టికి తెచ్చింది. ఈమేరకు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, బాలశౌరి, సి.రామచంద్రయ్య, బుట్టా రేణుక, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసరావు తదితరులు సోమవారం మూడు పేజీల ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా, కమిషనర్లు అశోక్‌ లవాసా, సుశీల్‌చంద్రలకు అందచేశారు. 

ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ..
‘ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఈసీకి కృతజ్ఞతలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక మేం ఈసీకి కొన్ని వినతిపత్రాలు ఇచ్చాం. కొందరు అధికారుల పక్షపాత ధోరణిని అందులో మీ దృష్టికి తెచ్చాం. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేందుకు వీలుగా సదరు అధికారుల్లో కొందరిని మీరు బదిలీ చేసినందుకు ధన్యవాదాలు. అయితే మేం ఫిర్యాదులో పేర్కొన్న మరికొన్ని విషయాలను ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో గుంటూరు రూరల్, చిత్తూరు జిల్లా పరిధిలో టీడీపీ నేతల కారణంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ రౌడీమూకలు మా పార్టీ అభ్యర్థిపై దారుణంగా దాడికి పాల్పడ్డాయి.

వేమూరు నియోజకవర్గంలో మా అభ్యర్థిపై భౌతిక దాడులకు పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. ప్రస్తుత స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి గుంటూరు జిల్లా ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌లోకి బలవంతంగా చొరబడి పోలింగ్‌కు గంటపాటు అంతరాయం కలిగించారు. గ్రామస్తులు కొద్దిసేపు సహించినా తరువాత తిరగబడి ఆయన్ను బయటకు పంపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన స్పీకర్‌పై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. పైగా ఆ పోలింగ్‌ బూత్‌లో లేని మా అభ్యర్థిపై, ఇతర నేతలపై కేసులు బనాయించారు. అసలు అక్కడ జరిగిందేంటో వీడియోల్లో చూడవచ్చు. 

కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారి పట్ల టీడీపీ ప్రభుత్వ తిరుగుబాటు వైఖరిని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్‌ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని మేం ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంలు బయటకు వచ్చాయని మా దృష్టికి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించి ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ను తొలగించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఈవీఎంలు బయటకు వచ్చాయి. 

ఓటు హక్కును కోల్పోయారు..
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాని 30 మంది ఆశా వర్కర్లు, 3,150 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు ఎన్నికల విధులు కేటాయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేటాయించకపోవడంతో వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఆర్టీసీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఓటింగ్‌కు దూరమయ్యారు. మే 22వ తేదీ వరకు సమయం ఉన్నందున వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్లు జారీచేసే అవకాశాన్ని కమిషన్‌ పరిశీలించాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగులకు ఏప్రిల్‌ 10న ఎన్నికల విధులను కేటాయించారు. వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందే సమయం కూడా లభించలేదు. అరకు మంగపట్టు పంచాయతీ పరిధిలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేసేందుకు వారికి మరో అవకాశం కల్పించాలి.

రోజువారీ అవసరాలకే పరిమితం కావాలి
టెలి కాన్ఫరెన్స్‌ తదితర వ్యవస్థలను పార్టీ కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి వినియోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని మీ దృష్టికి తెస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు, మీడియాకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించి ఓవర్‌ డ్రాఫ్ట్‌లు తెస్తోంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి భారంగా మారే విధానపరమైన నిర్ణయాలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న తరుణంలో ప్రస్తుత సర్కారు తీసుకోవడం సరికాదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వేతనాలు, పెన్షన్లు, రోజువారీ అవసరాలను తీర్చేందుకు మాత్రమే పరిమితమయ్యేలా ఆదేశాలు ఇవ్వాలి’

మా కార్యకర్తలను హింసిస్తున్నారు
– చంద్రబాబుకు మతి భ్రమించింది: ఎంపీ వి.విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరు, చోటు చేసుకున్న ఘటనలపై ఈసీకి లేఖ అందచేసిన అనంతరం వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి భ్రమించిందని, మైండ్‌ బ్లాంక్‌ అయిందని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన ఈవీఎంలు, ఓటింగ్‌ సరళిని ప్రశ్నిస్తూ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధుల్లో వినియోగించాలని మేం చాలాసార్లు కోరాం. నారాయణ, శ్రీచైతన్య సంస్థల సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించవద్దని పదేపదే విజ్ఞప్తి చేశాం. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కడప తదితర జిల్లాల ఎస్పీలను మార్చాలని మేం ఈసీని కోరినా కొందరినే బదిలీ చేసింది. మా విజ్ఞప్తి మేరకు ఎస్పీలను బదిలీ చేయని ప్రాంతాల్లో, చంద్రబాబు తొత్తులుగా వ్యవహరించిన చోట ముఖ్యంగా విజయనగరం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ నేతలు గణనీయంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి గంటన్నర పాటు అక్రమాలకు పాల్పడ్డారు. తన చొక్కా తానే చించుకుని సానుభూతి పొందాలనుకున్నారు. అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే ప్రతి రోజూ మా కార్యకర్తలను హింసిస్తున్నారు. నిన్న కూడా మా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరాం. 

చంద్రబాబుకు ఓటమి భయం
రాష్ట్రంలో ఇంచుమించుగా 80 శాతం పోలింగ్‌ జరిగింది. ఒకవైపు 130 స్థానాలు గెలుస్తామని చెబుతూ మరోవైపు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిగా మాట్లాడే తత్వాన్ని ఆయన అలవరచుకున్నారు. ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. జాతీయ పార్టీలు కూడా నమ్మట్లేదు. వీవీ ప్యాట్‌లో స్లిప్పు రానిపక్షంలో 11వ తేదీన ఉదయాన్నే ఎందుకు చెప్పలేదు? కుటుంబ సభ్యులతో సహా ఓటు వేసినట్టుగా ఆయన వేలు కూడా చూపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్‌ సీపీ విజయకేతనం ఎగురవేయబోతోందని ఆయనకు ప్రభుత్వ నిఘా వర్గాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే అపహాస్యం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

హరిప్రసాద్‌ మోసాలకు మారుపేరు..
‘హరిప్రసాద్‌ అనే వ్యక్తి ఈవీఎంలు దొంగిలించిన కేసులో జైలుకు వెళ్లారు. నేను పెట్టినట్టుగా ట్విటర్‌ మెసేజ్‌లు తయారు చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఏదైనా మానిప్యులేట్‌ చేయగలిగిన వ్యక్తి ఈ హరిప్రసాద్‌. మోసాలకు మారుపేరు ఈ హరిప్రసాద్‌. ఏ ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థ ఆయన్ను అనుమతించదు. తెలుగు దొంగల పార్టీలో మాత్రమే ఆయనకు ప్రవేశం ఉంది..’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఆ ముగ్గురిని జైలుకు పంపేందుకు ఆ ఒక్క కేసు చాలు..
ఆధార్‌ డేటా చౌర్యంపై కేసు నమోదైన విషయాన్ని మీడియా ప్రతినిధులు విజయసాయిరెడ్డి వద్ద ప్రస్తావించగా.. ‘ఆధార్‌ కార్డులు జారీ చేసే యూఐడీఏఐలో ఉన్నతస్థానంలో పనిచేసిన సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ సత్యనారాయణ రిటైర్డ్‌ అధికారి. చంద్రబాబుతో లాలూచీపడి ఆధార్‌ డేటాను ఈ –ప్రగతి అనే సంస్థకు, మరో రెండు సంస్థలకు ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడితోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు సంబంధించిన వ్యక్తులు కలిసి ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలకు ఈ డేటా అంతా ఔట్‌ సోర్సింగ్‌ చేసి అధికారిక డేటాను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు నాయుడిని, ఏబీ వెంకటేశ్వరరావును, డీజీపీ ఠాకూర్‌ను జైలుకు పంపించడానికి ఈ ఒక్క కేసు చాలు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారందరిపై చర్యలు తప్పవు. ఈ–ప్రగతి విషయంలో ఎంత దుర్వినియోగానికి పాల్పడ్డారో సంబంధిత వివరాలు మా వద్ద ఉన్నాయి. తగిన సమయంలో వాటిని బయటపెడతాం..’ అని చెప్పారు.

ఇప్పుడెందుకు పని చేయవు?
కృష్ణా జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంల తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరినట్టు బాలశౌరి తెలిపారు. 2014 ఎన్నికల్లో బాగా పనిచేసిన ఈవీఎంలు, నంద్యాల ఉప ఎన్నికలో బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు పనిచేయవని వ్యాఖ్యానించారు. ప్రజలంతా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చొని ఓట్లేశారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement