తిరుపతి నుంచి అమరావతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడటంతో శనివారం రాత్రి ధర్మవరం స్టేషన్‌లో ఒకటిన్నర గంట పాటు ఆగిపోయింది.
ధర్మవరంలో ఒకటిన్నర గంట పాటు రైలు నిలిపివేత
ధర్మవరం, న్యూస్‌లైన్: తిరుపతి నుంచి అమరావతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడటంతో శనివారం రాత్రి ధర్మవరం స్టేషన్‌లో ఒకటిన్నర గంట పాటు ఆగిపోయింది. శనివారం రాత్రి 9 గంటలకు రైలు ధర్మవరం సమీపంలోకి రాగానే పెద్ద శబ్దంతో పాటు డీజిల్ వాసన గుప్పుమంది. దీంతో కొందరు ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అంతలో రైలు ధర్మవరం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు ఇంజిన్‌ను తనిఖీ చేయాలని ప్రయాణికులు సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో ప్రయాణికులు రైలును ముందుకు కదలనివ్వబోమంటూ పట్టాలపై కూర్చున్నారు. దీంతో రైల్వే అధికారులు ఇంజిన్‌ను పరిశీలించారు. డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడినట్లు గుర్తించారు. కాసేపట్లోనే డీజిల్ అంతా కారిపోయింది. చివరికి గుంతకల్లు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించి రైలును నడిపారు. దీంతో రైలు అక్కడే ఒకటిన్నర గంట పాటు ఆగింది. ప్రయాణికులు పట్టుబట్టకపోయి ఉంటే ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని అధికారులు పేర్కొన్నారు.