టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దు | Telangana congress leaders are not agreed to Tie up with TRS party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దు

Published Sun, Mar 9 2014 3:44 AM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే అది పార్టీకి తీవ్ర నష్టమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేల్చారు. మారుతున్న సమీకరణాల్లో టీఆర్‌ఎస్‌కు ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని అభిప్రాయపడ్డారు.

* హైకమాండ్‌కు టీ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
* ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ సీట్లు సాధిస్తాం
* హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే అది పార్టీకి తీవ్ర నష్టమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేల్చారు. మారుతున్న సమీకరణాల్లో టీఆర్‌ఎస్‌కు ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక తీర్మానం చేసి దాన్ని హైకమాండ్ పెద్దలకు పంపించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకుంటే అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే ధీమా వ్యక్తం చేశారు. తాజా మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసంలో శనివారం సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మేరకు తీర్మానం చేసి హైకమాండ్ పెద్దలకు పంపారు.
 
 కేంద్ర మంత్రి బలరాంనాయక్, తాజామాజీ మంత్రులు జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కె.శ్రీధర్, మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ప్రేంసాగర్‌రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు, స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తెలంగాణలో ప్రజల సమస్యలు, విద్యుత్ కోత వంటి అంశాలపై చర్చించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 70 వరకు అసెంబ్లీ స్థానాలను కోరుతున్నారని, పొత్తు ఖరారైతే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని సమావేశంలో నేతలంతా అభిప్రాయపడ్డారు.
 
  టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణమే లేదని, దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి బలం కూడా లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నందున టీఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని, కాంగ్రెస్‌తో పొత్తు కోసం దిగిరాక తప్పదని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు ఎంపీలు మాత్రం టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకుంటే తెలంగాణ వాదుల ఓట్లన్నీ గంపగుత్తగా ఇరు పార్టీలకు పడతాయని, లేనిపక్షంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేయడంవల్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారంలోకి రాగలదన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
 
 ఈ మేరకు ఓ లేఖను రూపొందించి హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని వెంటనే సమాయత్తం కావాలని తీర్మానించారు. జిల్లాల వారీగా కమిటీలు వేసుకుని అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు వంటి కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంతోపాటు అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని తీర్మానించారు. కాగా, తెలంగాణ రాష్ట్రమిస్తే ఈ ప్రాంత ప్రజలంతా కాంగ్రెస్ వెంట ఉంటారని సోనియాగాంధీకి హామీ ఇచ్చామని జానారెడ్డి చెప్పారు.  సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. రెండు సీట్లున్న పార్టీ కూడా తెలంగాణ తామే తెచ్చామంటున్నారని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను ఎద్దేవా చేశారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఇటీవల అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు, పంటలు నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 తెలంగాణ కాంగ్రెస్ సమన్వయకర్తగా జానా
 తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ సమన్వయకర్తగా జానారెడ్డిని నియమించుకున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల తరపున హైకమాండ్‌తో సంప్రదింపులు జరపడంతోపాటు స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా జానారెడ్డిని ఎన్నుకున్నారు.  శనివారం  సమావేశమై ఆయన పేరును ఏకగ్రీవంగా తీర్మానించారు. జానారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ తెలంగాణ జిల్లాల డీసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి లేఖ రాశారు.
 
 ఒంటరి పోటీ మేలు
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని, ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నారని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఏఐసీసీ కార్యదర్శి  జి.చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రాములు యాదవ్ సహా 30 మంది శనివారం జైపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణ సాధనలో కీలకమైన కృషి చేశా. ఆ వివరాలు సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తా. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటవుతుంది. నేను మాత్రం టీపీసీసీ చీఫ్ రేసులో లేను. మాజీ సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన తన బలం గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నార’’ని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement