పొన్నాల లక్ష్మయ్య(ఫైల్)
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కల్పించిన భ్రమల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏడు నెలల పాలనలో మోదీ సర్కారు పలు అంశాల్లో యూటర్న్ తీసుకుందని విమర్శించారు. హామీలపై వెనక్కు తగ్గుతున్న వైనాన్ని ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తక ముద్రణ కాదు, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పొన్నాల తెలిపారు.
ఎన్నికలకుముందు మోదీ చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. మోదీ సర్కార్ కల్పించిన భ్రమలన్నీ తొలగిపోయాయని చెప్పారు.
కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు తమ పార్టీ బాటలోనే నడుస్తున్నారని మరో నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 'మోదీ యూ టర్న్' పుస్తకాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు.