తెలంగాణ దశాబ్ధాలనాటి డిమాండ్: జైరాం రమేష్
గుంటూరు : సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడటంతో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది 2014 ఎన్నికల్లో లబ్ది పొందటం కోసం కాదని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ డిమాండ్ దశాబ్దాల నాటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వటంతో పాటు సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా కాంగ్రెస్ కాపాడిందని అన్నారు.
అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదనేది హైదరాబాద్ నేర్పిన పాఠమన్నారు. రాజధాని ఏర్పాటుకు సీమాంధ్రలో అనేక నగరాలు ఉన్నాయని జైరాం రమేష్ తెలిపారు. భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి ఉంటుందని.... సీమాంధ్రలో రాజధాని కోసం వారంలోగా నిపుణుల కమిటీ ఏర్పుడుతందని తెలిపారు.
సీమాంధ్రలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని ....రాజధాని ఒకచోట, అసెంబ్లీ మరోచోట, కార్యాలయాలు ఇంకోచోట ఉండవచ్చునని జైరాం రమేష్ పేర్కొన్నారు. అన్ని అవకాశాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. 84వేల రాష్ట్ర ఉద్యోగులను జనాభా ప్రాతిపదిక మీద ఆప్షన్ల మేరకు విభజిస్తామని జైరాం రమేష్ చెప్పారు.