లాయర్ల విధుల బహిష్కరణ | Telangana Lawyers expulsion from their duties | Sakshi
Sakshi News home page

లాయర్ల విధుల బహిష్కరణ

Published Thu, Sep 12 2013 3:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

లాయర్ల విధుల బహిష్కరణ - Sakshi

లాయర్ల విధుల బహిష్కరణ

సాక్షి, నెట్‌వర్క్ : తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడానికే హైకోర్టు కేంద్రంగా సీమాంధ్ర న్యాయవాదులు కుట్రలు చేస్తున్నారని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.  సీమాంధ్ర న్యాయవాదుల దాడులకు నిరసనగా రాష్ట్ర న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ జిల్లాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అంబరీషరావు, సునీల్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
 
  హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టిస్తే.. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందనే వారు ఇలా వ్యవహరిస్తున్నారని, దీన్ని తెలంగాణవాదులు అడ్డుకోవాలని కోరారు. సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్, జనగామలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.  ఖమ్మంలోని జిల్లా కోర్టు ముందు సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. భద్రాచలంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు.
 
 ఇల్లెందులో కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నల్లగొండ న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, కోర్టు ఎదుట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వె ళుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు సర్దిచెప్పి పంపారు.  నిజామాబాద్‌లో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ కోర్టుల్లో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. బోధన్‌లో విద్యార్థి సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 1354వ రోజుకు చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement