తడారి.. ఎడారి!
కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులతో జిల్లాకు ఇబ్బందే
2.4 లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యే అవకాశం
తెలుగు గంగకు నీరు నిలిచిపోవచ్చు
హంద్రీ-నీవాతో కుప్పానికీ నీరు కరువు
బాబు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టనున్న ప్రాజెక్టులతో జిల్లా కరువు కోరల్లో చిక్కుకోనుంది. తాగునీటి సమస్య మరింత తీవ్రం కానుంది. నీరు ప్రజల సంపద.. అన్ని వర్గాలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు సర్కారు చేతగానితనం వల్లే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మించడానికి పూనుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించి, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మౌనం వహిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.
చిత్తూరు: తాగు, సాగునీటి కోసం జిల్లా ప్రజలు ఇప్పటికే భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల నీటి మట్టం రోజురోజుకీ తగ్గిపోతోంది. పదేళ్ల క్రితం 200 అడుగుల్లో పుష్కలంగా నీరుండేది. ఇపుడు వెయ్యి అడుగులు తవ్వినా నీరు దొరకని పరిస్థితి. ముందు చూపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించారు. ఆయన మరణం తరువాత ఆ రెండు ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
వైఎస్ పోరాటం వల్లే
తెలుగుగంగ ప్రాజెక్టును అప్పట్లో చెన్నై తాగునీటి కోసమే డిజైన్ చేశారు. దీన్ని అప్పటి ప్రతిపక్షనేత వైఎస్.రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రాయలసీమ నీటి అవసరాలను తీర్చిన తరువాతనే మిగతా వాటిని ఆలోచించి పంపిణీ చేయలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్టీ రామారావు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటికప్పుడే డిజైన్ మార్చి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగు నీటిని అందించే ప్రాజెక్టుగా రూపొందించారు. ప్రస్తుతం తిరుమల, తిరుపతి, రేణిగుంటతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చే వనరుగా మారింది.
దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో చిత్తూరు ఎడారే
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న దిండి, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో చిత్తూరు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉంది. జిల్లాకు ప్రధాన నీటి వనరు తెలుగుగంగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తోడుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో తప్పనిసరిగా 854 అడుగుల నీరు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం క్లష్ణా నదిపై దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించి 830 అడుగుల్లోనే నీరు తోడుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల జిల్లాలో 1,03,000 ఎకరాలకు నీరందిచే గాలేరు, నగరి ప్రాజెక్టు, తిరుపతి, తిరుమల, మరికొన్ని పట్టణాలకు నీరందించే తెలుగు గంగకు నీరు వచ్చే అవకాశం ఉండదు.
హంద్రీ-నీవా హుళక్క
హంద్రీ-నీవా వల్ల జిల్లాలో సుమారు 1,36000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. సీఎం నియోజకవర్గం కుప్పం తాగునీటి సమస్య తీరే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాలో 4లక్షల మందికి నీరు అందించవచ్చు. ఇంత విలువైన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాజెక్టుల వల్ల నీరు అందకుండా పోయే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో 90 టీఎంసీలు, దిండి ప్రాజెక్టు పేరుతో మరో 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసేం దుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనివల్ల హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాకు చుక్కనీరు వచ్చే అవకాశం ఉండదు.
రాయలసీమ క్షేమం కోసమే జగన్ దీక్ష
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడితే రాయలసీమలోని అన్ని జిల్లాలు కరువుతో అల్లాడిపోతాయి. తాగునీటి సమస్య పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉం చుకొనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మూడు రోజుల పాటు కర్నూలులో దీక్ష చేపట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.