నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
Published Wed, Feb 5 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 66 రోజుల పాటు సమ్మె చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కనున్నారు. ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సోమవారం సమావేశమై మెరుపు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె ద్వారా మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఉద్యోగులు మినహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిపాలన స్తంభించనుంది.
సమైక్యవాదాన్ని వినిపించాలి
పార్లమెంట్‌లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సమైక్యవాదాన్ని వినిపించాలని జిల్లా ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం కాకినాడ ఏపీ ఎన్‌జీవో హోంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన మేరకు సమ్మెలోకి వెళ్లాలని తీర్మానించారు. ఏపీఎన్‌జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర సంఘం పిలుపుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు 15న వెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు అనిల్ జాన్సన్, నాగేశ్వరరావు, జియాఉద్దీన్, పసుపులేటి శ్రీనివాసరావు, సరెళ్ల చంద్రరావు, వై. శ్రీనివాస్, విజయకుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement