సీమాంధ్రలో స్తంభించిన పాలన | APNGOs strike starts in seemandhra regions | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో స్తంభించిన పాలన

Published Tue, Aug 13 2013 4:20 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

సీమాంధ్రలో స్తంభించిన పాలన - Sakshi

సీమాంధ్రలో స్తంభించిన పాలన

సమ్మె విరమించాలన్న మంత్రివర్గ ఉపసంఘం
తిరస్కరించిన ఏపీఎన్‌జీవో, ఉద్యోగ సంఘాలు
13 జిల్లాల్లో 123 డిపోల్లో నిలిచిపోయిన బస్సులు
నిలిచిపోనున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు
అత్యవసర సేవలకు సమ్మె మినహాయింపు
సమ్మెపై ఉపాధ్యాయుల నిర్ణయం నేడు వెల్లడి!
తిరుమల బస్సులకూ బ్రేక్.. నాలుగు దశాబ్దాల తర్వాత నిలిచిన సర్వీసులు
సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుంది: ఉద్యోగ సంఘాలు
 సమ్మెలో పాల్గొంటున్న వారు.. నాలుగో తరగతి ఉద్యోగులు
డ్రైవర్లు, ఎన్‌జీవోలు, గెజిటెడ్ అధికారులు, వీఆర్‌వోలు, గ్రామసహాయకులు,
ఆర్‌టీసీ, మున్సిపల్, విద్యుత్, టీటీడీ ఉద్యోగులు మొత్తం 3.5 లక్షల మంది.
‘ట్రెజరీ’ సమ్మెతో 150 కోట్ల రాబడికి అంతరాయం (రోజుకు)

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు, ఆర్‌టీసీ కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఆర్‌టీసీ కార్మికుల సమ్మె వల్ల సీమాంధ్ర 13 జిల్లాల్లోని 123 డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ప్రభావం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎన్‌జీవోలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని నాలుగో తరగతి ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, డ్రైవర్లు సమ్మెలో ఉన్నారు. దీంతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో.. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది.
 
  సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వానికి రోజూ రూ. 147 నుంచి రూ. 150 కోట్లు రాబడి వస్తుంది. ట్రెజరీ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రభుత్వ రాబడి నిలిచిపోనుంది. ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే విషయంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది. అయితే.. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సమ్మెలో పాల్గొననున్నట్లు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి సోమవారం ప్రకటించారు.
 
 
 సమ్మె యథాతథం: ఏపీఎన్‌జీవో
 నిరవధిక సమ్మెను ఆఖరి అస్త్రంగానే ఉపయోగించాలని, సమ్మె వల్ల పౌరసేవలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం చేసిన విజ్ఞప్తికి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించలేదు. సమ్మె నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని, యథాతథంగా సమ్మె ఉంటుందని స్పష్టం చేశాయి. భేటీ అనంతరం.. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షడు రాయుడు అప్పారావు, ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు యోగీశ్వర్‌రెడ్డి, ఖజానా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్, సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు.. తదితరులతో కలిసి ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. పౌర సేవలకు విఘాతం కలుగుతుందని, సమ్మె యోచన విరమించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. సమ్మె విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, ఎన్‌జీవోలు, గెజిటెడ్ అధికారులు, వీఆర్‌వోలు, గ్రామసహాయకులు, ఆర్‌టీసీ, మున్సిపల్, విద్యుత్, టీటీడీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని చెప్పారు.
 
 ‘‘హింసకు తావు లేకుండా సమ్మె చేస్తామన్నారు. ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలనే డిమాండ్‌తోనే సమ్మెకు వెళుతున్నట్లు గతంలో ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో అసలు రాజీనామాల గురించే ప్రస్తావించలేదు..?’ అని విలేకరులు అడిగినప్పుడు.. ‘‘మంత్రివర్గ ఉపసంఘానికి ఉన్న పరిధి, బాధ్యతలు ఏమిటి? ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి ఏర్పాటయిన కమిటీ అది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటయింది కాదు. రాజీనామాల గురించి కమిటీకి చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే కమిటీ పిలిచి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది’’ అని వారు బదులిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న అంశం కాదని, తమకున్న టాప్ టెన్ అంశాల్లో అదొకటని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 ఎంపీల రాజీనామాలతోనే విభజన ఆగుతుంది...
 ఎంపీలు రాజీనామాలు చేస్తేనే పార్లమెంటులో రాజకీయ శూన్యత వస్తుందని, అందువల్ల విభజన ఆగిపోతుందని, అందుకే తాము ఎంపీల రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశామని ఉద్యోగ సంఘాల నేతలు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే పార్లమెంట్, అసెంబ్లీలో సీమాంధ్ర వాణిని వినిపించటం సాధ్యం కాదని మంత్రులు అంటున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘శ్రీకృష్ణ కమిటీ కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేశారు. కమిటీ రాష్ట్రమంతా తిరిగి అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించి సమగ్రంగా నివేదిక సమర్పించింది. విభజన వల్ల రాష్ట్రంలో అశాంతి ఏర్పడుతుందని, రాష్ట్రం నష్టపోతుందని కమిటీ చెప్పింది. ఆఖరు ప్రత్యామ్నాయంగానే విభజనకు మొగ్గు చూపాలని సూచించింది. కమిటీ నివేదిక మీద ఇప్పటికీ చర్చ జరగలేదు. శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిన తర్వాత.. ఇప్పుడు కొత్తగా చర్చించేది, సీమాంధ్ర వాణి వినిపించేది ఏమి ఉంటుంది? రాజీనామాలే ఇప్పుడు విభజనను అడ్డుకోగలవు’’ అని వారు పేర్కొన్నారు.
 
 టీ-ఉద్యోగులు అడ్డుకోకుండా సహకరించాలి..
 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత ఉద్యోగులు గతంలో చేసిన సమ్మె, వంటా వార్పు, ఇతర నిరసన కార్యక్రమాలను తాము అడ్డుకోలేదని, ఇప్పుడు తమ నిరసనలను అడ్డుకోకుండా సహకరించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు కూడా కలిసొస్తే.. మొత్తం 4.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. 2009 డిసెంబర్ 9న చేసిన తెలంగాణ అనుకూల, 23న చేసిన ఉపసంహరణ ప్రకటనలు, జూలై 30న ప్రకటించిన నిర్ణయం అన్నీ పొరపాట్లేనన్నారు. ప్రజల సహకారంతో సమ్మెకు వెళుతున్నామని, ఎవరి ప్రోద్బలం, సహకారం లేవని మరో పశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మె నుంచి అత్యవసర సేవలు మినహాయించామన్నారు. స్వాంతంత్ర వేడుకల మీద సమ్మె ప్రభావం ఉండదని, ఉద్యోగులంతా జెండా వందనం చేస్తారని చెప్పారు.
 
 సీఎస్‌కు సమ్మె నోటీసులు
 ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల ఎన్‌జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం.. సోమవారం వేర్వేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నాయి. మరోవైపు విజయవాడలో పౌర సరఫరాల ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. 13 సీమాంధ్ర జిల్లాల ట్రాన్స్‌కో ఉద్యోగ ప్రతినిధులు సమావేశమై సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.
 
 బెంగళూరు టు విజయవాడ రూ. 3 వేలు!
 సాక్షి, బెంగళూరు: రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బస్సు టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తూ ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్సు టికెట్ ధర సుమారు రూ. 1000గా ఉండగా.. గత శుక్రవారం నుంచి దీనిని రూ. 3000గా వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఈ ధరలను చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.  
 
 సమ్మెలో పౌరసరఫరాల ఉద్యోగులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగిన నేపథ్యంలో వాటికి సంఘీభావంగా ఈ 13 జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి తెలిపారు.  
 
 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకూ తాళాలు
 సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు కూడా రాష్ట్ర విభజన సెగ తాకింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ఫోరం నిర్ణయించింది. ఫలితంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో స్థిరాస్తి క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని లావాదేవీలు ఆగిపోనున్నాయి. ‘‘రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు సంబంధించి సీమాంధ్ర 13 జిల్లాల్లో అటెండర్ స్థాయి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి వరకూ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయాలని నిర్ణయించాం’’ అని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ఫోరం ప్రతినిధులు బాలస్వామి, భాస్కర్‌రావు, బాలాజీ తెలిపారు.
 
 పంచాయతీరాజ్ ఉద్యోగుల మద్దతు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సం ఘం మద్దతిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర తెలిపారు. ఆయా జిల్లాల కార్యవర్గాల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు ప్రాంతాల్లోని ఉద్యోగులు తమ ఆకాంక్షల కు అనుగుణంగా ఉద్యమాల్లో పాల్గొనవచ్చని, సమ్మె చేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement