దుగ్గొండి/ కాజీపేట, న్యూస్‌లైన్
తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీలో అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరు.. నూరైనా.. ఇటు పొద్దు అటు పొడిచినా.. రాష్ట్రం కచ్చితంగా ఏర్పడుతుందని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం-ప్రస్తుత పరిణామాలు’ అంశంపై దుగ్గొండి మండలం గిర్నిబావిలోని వందనా గార్డెన్... ‘తెలంగాణ రాష్ట్ర సాకారం- పున ర్నిర్మాణం’ దర్గా కాజీపేటలోని కాళోజీ ప్రాంగణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, సహజ వనరులను దోచుకుంటున్న మీతో మాకు సంబంధం వద్దని చెబుతున్న తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పాలకులు వెంటపడి వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇక్కడి ఆడపడుచుల సగం జీవితం నీళ్లు తీసుకొచ్చేందుకే సరిపోతోందని ఆవే దన వ్యక్తం చేశారు. సాగునీరు లేక.. ఎవుసం గిట్టుబాటు కాక.. రైతులు, పేదలు పనుల కోసం పట్టణాలకు వలసబాట పడితే వారి భార్యలు కుటుంబ పోషణ భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పెత్తనం, దోపిడీ, అధికారం కోసం మాత్రమే జరుగుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణవాదులు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ర్ట్రం ఏర్పడితే నీళ్లు, కరెంట్ సమృద్ధిగా ఉండడంతోపాటు విద్య, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అందరూ జీ హుజూర్‌లే... : కత్తి వెంకటస్వామి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ ఆమె ఎదుట జీ హుజూర్ అన్నావారేనని.. మరి కృత్రిమ ఉద్యమాలు ృసష్టించి తెలంగాణను ఆపుతున్నదేవరని టీజేఏసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి ప్రశ్నించారు. శత్రువుననయినా తెలంగాణ ప్రజలు క్షమిస్తారు కానీ.. దగా చేస్తే వారిని ఊరుకోరని పాలకులను హెచ్చరించారు. హరిహర బ్రహ్మరాథులు అడ్డుపడిన తెలంగాణ ఏర్పాటు ఆగదని ఆయన చెప్పారు.
45 రోజులైనా ప్రక్రియ పూర్తి కాకపోవడం దారుణం : కారం రవీందర్‌రెడ్డి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి 45 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం దారుణమని టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి అన్నారు. సీమాంధ్ర నాయకులు ఉద్యోగ సంఘాలను ముందు పెట్టి ఉద్యమాలు చేయించడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌లో 30వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉండగా అందులో మూడు వేలమంది ఉద్యోగులు మాత్రమే సమ్మె చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ దోపిడీకి అధికారిక లెసైన్స్ పొందడానికే సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోసగాళ్లు, మాటమార్చే పార్టీలకు తెలంగాణ ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారన్నారు. కాగా, సదస్సుకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో భారీగా తరలిరావడంతో తెలంగాణ సంప్రదాయం ప్రతి ధ్వనించింది. సదస్సులో ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ, డోలి సత్తన్న, డివిజన్ జేఏసీ కన్వీనర్ గుంటి రాంచందర్, మహిళా జేఏసీ కన్వీనర్ గుడిపూడి అరుణ, మండల జాక్ కన్వీనర్ బొనగాని రవీందర్, మహిళా జేఏసీ అధ్యక్షురాలు తాళ్లపెల్లి సాంబలక్ష్మి, చాడ అనిత, గాదె శైలజ పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చి తీరుతుంది
Published Mon, Sep 16 2013 4:14 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement