తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. తమకు తగినన్ని సీట్లు ఇస్తేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, అసలంటూ పొత్తు ఉంటే రెండు రాష్ట్రాల్లోను ఉంటుందని.. లేకపోతే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో బీజేపీ 25 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు అడుగుతోంది. అయితే టీడీపీ మాత్రం 12 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు మాత్రమే ఇస్తామని అంటోంది. ఇక తెలంగాణ ప్రాంతంలో 45 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇస్తామని టీడీపీ అంటుండగా దీనిపై బీజేపీ నాయకత్వం చర్చిస్తోంది.
మంగళవారం సాయంత్రానికి పొత్తు చర్చలు సఫలమైతే అధికారికంగా ప్రకటన వస్తుందని, లేనిపక్షంలో పొత్తు లేనట్లేనని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతంలో టికెట్ల పంపకంపైనే సమస్య ఉందని, దీన్ని అధిష్ఠానమే తేల్చాల్సి ఉందని హరిబాబు అన్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
టీడీపీ - బీజేపీ పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన
Published Mon, Mar 31 2014 7:49 PM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
Advertisement