బెట్టింగ్ బాబోయ్! | tdp crores being bet on Seemandhra election outcome | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ బాబోయ్!

Published Sat, May 10 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

బెట్టింగ్ బాబోయ్!

బెట్టింగ్ బాబోయ్!

సైకిల్ పార్టీలో జోరుగా పందేల వ్యాపారం
ఎన్నికల్లో పార్టీకి పెట్టుబడులు పెట్టిన వారిజేబులు నిండటం, ఫలితాల వరకైనా బీజేపీని
అంటిపెట్టుకొని ఉండటమే లక్ష్యం
టీడీపీ ప్రభుత్వం రాదని తేలిపోవడంతో డబ్బులు తిరిగి రాబట్టుకొనే పనిలో పెట్టుబడి నేతలు
పార్టీ అభిమానులు, కార్యకర్తలే లక్ష్యంగా బెట్టింగ్ వ్యాపారానికి తెరతీసిన నాయకులు
ముందుగా టీడీపీ గెలుస్తుందని చంద్రబాబుతో ప్రకటనలు.. ఆ వెంటనే
బుకీలతో కలసి పందేలు షురూ
రూ. లక్షలు, కోట్లలో సవాళ్లు.. కొన్నిచోట్ల పొలాలు, ఇతర ఆస్తులనూ పందెం కాస్తున్న ఆశావహులు
గతంలోనూ టీడీపీలో ఇదే పద్ధతి..ఓడే వరకూ గెలుపు మాటే
బెట్టింగుల్లో ఉన్నదంతా పోగొట్టుకున్న అమాయకులు.. ఈసారీ ఇదే డ్రామా
 
 ‘చంద్రబాబు చెబుతున్నాడుగా! టీడీపీ ప్రభుత్వమే వస్తుంది. పందెమా?’
 ‘అవునా! 2009లోనూ ఇలాగే చెప్పాడు. ఆ మాట నమ్మి ‘లక్ష’ పోగొట్టుకున్నాను. ఇప్పుడూ అలాగే చెబుతున్నాడు. నమ్మేదెట్టా?
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందిగా. వాళ్లే గెలిచేట్టున్నారుగా..’
 
 ‘బెట్.. లక్ష’.. ఇదీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతల బెట్టింగ్.. ఇంకా వీరాభిమానులైతే కోట్లు, ఎకరాలకొద్దీ భూములు, ఇతర ఆస్తులు కూడా పెట్టి పందేలు కడుతున్నారు. గత అనుభవాలున్న వారు మాత్రం ఆచితూచి పందేలు కడుతున్నారు. నమ్మకం పూర్తిగా సన్నగిల్లిన నేతలు చంద్రబాబు మాటలను విశ్వసించడంలేదు. ‘చూద్దాంలే’ అంటూ తప్పుకుంటున్నారు. ఈ దందాలో బుకీలు, అసాంఘిక శక్తులు కోట్లు సంపాదించుకుంటుండగా, సామాన్యులు సమిధలవుతున్నారు.
 
 ఇదంతా ఎందుకు జరుగుతోంది? కోట్ల రూపాయల్లో సాగుతున్న బెట్టింగ్‌ల వెనుక అసలు వ్యవహారమేమిటన్నది లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలెన్నో ఉన్నాయని తెలిసింది. ఇందులో ప్రధానంగా రెండు పక్షాలు ఇమిడి ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. మొదటిది పార్టీ కోసం ఎన్నికల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేతల లాభం. రెండోది ఎన్నికల ఫలితాల వరకైనా కేంద్రంలో బీజేపీని అంటిపెట్టుకొని ఉండటం. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే వివిధ రూపాల్లో పెద్దమొత్తంలో సంపాదించుకోవచ్చన్న ఆలోచనతో నేతలుగా ఎదిగిన కొందరు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పార్టీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవదని వారికి అర్థమైపోయింది. పార్టీ గెలిస్తే తాము పెట్టిన పెట్టుబడులకు మరింత ఎక్కువ రాబట్టుకోవచ్చన్న వ్యూహం వర్కవుట్ కాదని తేలిపో!యింది. దీంతో తాము పెట్టిన పెట్టుబడితోపాటు సాధ్యమైనంత ఎక్కువ డబ్బు రాబట్టుకోవడానికి వారు కొత్త అంకానికి తెరతీశారు. అదే బెట్టింగ్. దీనికీ ఒక వ్యూహాన్ని రచించారు. ఇందులో లాభపడేది బుకీలు, వ్యాపారులు, నేతలు అయితే, సమిధలయ్యేది మాత్రం సామాన్యులు, కార్యకర్తలే.
 
 పచ్చ పార్టీలో ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరుగుతున్న తంతే. 2004, 2009 ఎన్నికల సందర్భంగానూ సరిగ్గా ఇదే తరహాలో ఈ నేతలు హైడ్రామా నడిపించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయన్నది వారికి కచ్చితంగా తెలిసినప్పటికీ, టీడీపీనే గెలుస్తుందంటూ అమాయకులను బురిడీ కొట్టించి, రెచ్చగొట్టే మాటలతో కోట్లలో పందేలు కాసి డబ్బు సంపాదించుకున్నారు. 2004లో పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ జరక్కముందే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న దానిపై వంద శాతం నమ్మకంతో ఉన్నామని, కేంద్రంలో ఎన్టీఏకు మద్దతిస్తామని బాబు చెప్పారు. పార్టీ కోటరీతో చర్చించాక పథకం ప్రకారం లీకులు ప్రచారం చేశారు. వెంటనే బెట్టింగ్ వ్యాపారులు, వారికి అండగా పార్టీ నేతలు రంగంలోకి దిగి అమాయకులతో పందేలు కాసి కాసులు వెనకేసుకున్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలను, అమాయకులను టార్గెట్ చేసుకొని లక్షల్లో బెట్టింగులు కడుతున్నారు.
 
 ఈసారీ అదే వ్యూహం!
 
 సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ ముగిశాక నిజానికి బాబే కాదు, టీడీపీ నేతలెవరూ తొలుత పెదవి విప్పలేదు. బాబు విలేకరులతో ముక్తసరిగా మాట్లాడి 100 సీట్లు గెలుస్తామన్నారు. మిగతావారైతే మీడియా ముందుకు రావడానికే సాహసించలేకపోయారు. దాంతో ఆ రాత్రి బెట్టింగ్‌కు ఎవరూ ఆసక్తి చూపలేదు. మర్నాడు కోటరీ నేతలు రంగంలోకి దిగి బాబును కొన్ని ఎంపిక చేసిన చానెళ్లతో మాట్లాడించారు. 120 సీట్లకు పైగా గెలుస్తామని, సీఎంగా ప్రమాణమే తరువాయి అని చెప్పించారు. ఆ నేతలు దాన్నే విస్తృతంగా ప్రచారం చేయించారు. టీడీపీ మరిన్ని స్థానాల్లో నెగ్గుతుందని ఆ సాయంత్రానికల్లా ప్రచారం మొదలుపెట్టారు. ఇంకేముంది.. బెట్టింగ్ మొదలైపోయింది. క్రికెట్ బుకీలు కూడా రాష్ట్రంలో వాలిపోయారు. వారికి టీడీపీ నేతలు అండగా నిలిచారు.
 
 ఇలా టీడీపీ గెలుస్తుందని తెరవెనుక పథకం ప్రకారం భారీగా ప్రచారం చేయించిన నేతలే... అదేమీ తెలియనట్టు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ అభిమానులు,  కార్యకర్తలతో పందేలు కాసి జేబులు నింపుకునే పనిలో పడ్డారు. పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపుకు మధ్య వారానికి పైగా వ్యవధి ఉండటంతో గతంలో కంటే ఈసారి బెట్టింగ్‌ల జోరు చాలా ఎక్కువగా ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటి 17 అంశాలపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయని అంచనా. సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ ఫేవరేట్లుగా ఉన్నాయి. మరే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందెం కాసినా ఒకటికి రెండు, మూడు రెట్లు ఇచ్చేందుకు కూడా బుకీలు వెనకాడటంలేదు. దాంతో టీడీపీ అభిమానులే ఎక్కువగా వారి బారిన పడుతున్నారు.  వైఎస్సార్‌సీపీ నూటికి నూరుపాళ్లు గెలిచే స్థానాల్లో కూడా టీడీపీ నేతలకు సవాల్ విసిరి బెట్టింగ్‌కు ఉసిగొల్పుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం బెంగళూరు, చెన్నై, ముంబై కేంద్రాలుగా జరుగుతోంది. గుజరాత్ బుకీలు రాష్ట్రంలో మకాం వేసి పందేలు కడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, అనపర్తి, కాకినాడ, దర్శి, నెల్లూరు తదితర ప్రాంతాలు బెట్టింగ్‌లకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. కొన్నిచోట్ల స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఇండియా బెట్, బెట్టింగ్ బెట్ ఫెయిర్, పొలిటికల్ బెట్టింగ్ వంటి సైట్లు ఆన్‌లైన్ పందేలు నిర్వహిస్తున్నాయి.
 
 ప్రతిసారీ ఇంతేగా బాబూ!
 
 ‘‘ఈ ఎన్నికల్లో గెలుస్తాం.. గెలిచి తీరుతాం..’’ అనేది ప్రతి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పే మాట. పోలింగ్ తర్వాత స్వీయ ఎగ్జిట్ పోల్స్‌ను చూపించి ఆయన హడావుడి చేస్తుంటారు. బాబు చెప్పడం, ఆయన సన్నిహితవర్గం ప్రచారం చేయడం, నమ్మి అమాయక జనం, కార్యకర్తలు లక్షల్లో మునిగిపోవడం... ప్రతిసారీ జరిగే తంతే. 1996, 1998 ఎన్నికలప్పుడు బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. లోక్‌సభ స్థానాలన్నీ టీడీపీవేనన్నారు. రెండో విడత పోలింగ్‌ను ప్రభావితం చేసేందుకు, తొలి విడతలో తమదే జోరని ప్రచారం చేసుకోవడం టీడీపీ పంథా. 1998 లోక్‌సభ ఎన్నికలప్పుడు అమలాపురం నుంచి నంద్యాల వరకు 21 స్థానాల్లో 18 గెలుస్తామని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే 18 పోయి, 3 లోక్‌సభ స్థానాలు మాత్రమే దక్కాయి.
 
 2004లో చేదు అనుభవం
 
 2004లో వైఎస్ పాదయాత్ర ప్రభంజనమై, ఆయన గెలుపు ఖాయమని సర్వేలన్నీ వెల్లడించినప్పటికీ పోలింగ్ పూర్తయిన మరుక్షణమే బాబు మీడియా సమావేశం పెట్టి మరీ, టీడీపీకి 200కు పై చిలుకు ఖాయమని ప్రకటించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకార తేదీనీ ఖరారు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో సంబరాలు జరుపుకున్నారు. బాబు మాటలు నమ్మి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లకు బెట్టింగులు కట్టిన వాళ్లంతా నిండా మునిగారు. 46 మంది ఎకరం, రెండెకరాలు భూములు వదులుకోవాల్సి వచ్చింది. సామాన్య మధ్య తరగతి ప్రజల్లో 60 మంది బెట్టింగుల కారణంగా ఇళ్లూ వాకిళ్లూ అమ్ముకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ పేద రైతు టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. తర్వాత పార్టీకి గుడ్‌బై చెప్పాడు. గుంటూరు జిల్లాలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆరుగురు రూ.8 లక్షలు నష్టపోయారు.
 
 2009లోనూ ఇంతే...
 
 2009 ఎన్నికల్లో చంద్రబాబు మరింత హడావుడి చేశారు. పోలింగ్ ముగియడంతోనే సమీక్షల మీద సమీక్షలు చేశారు. నివేదికలు తెప్పించారు. మంత్రివర్గ కూర్పు కూడా జరుగుతున్నట్టు పార్టీవర్గాలు ప్రకటించాయి. నగదు బదిలీ పథకం సూపరన్నారు. టీడీపీ కూటమికి 200 సీట్లకు పైగా ఖాయమన్నారు. 170  సీట్లు ఒక్క టీడీపీకే వస్తాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంతా సంబరాల్లో మునిగి తేలింది. తీరా ఫలితాలతో పార్టీకి దిమ్మతిరిగింది. ఆలోపే బుకీలు దుకాణాలు వందకు మూడొందలు ఇస్తామన్నారు. ఎకరాలకు ఎకరాలు పందేలు కాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.700 కోట్ల బెట్టింగులు జరిగినట్టు సమాచారం. ముంబై, చెన్నై బుకీలతో స్థానిక టీడీపీ నేతలే రింగ్ అయినట్టు ఆరోపణలొచ్చాయి. టీడీపీ వీరాభిమానులైన విశాఖపట్టణంలోని ఇద్దరు పారిశ్రామికవేత్తలు లక్షల్లో మునిగినట్టు తెలిసింది. పశ్చిమగోదావరిలో బెట్టింగ్ వ్యాపారంలో టీడీపీ నేతలే కీలకపాత్ర పోషించారని, వారు బాగుపడ్డా పందేలు కాసిన వారు మాత్రం ఆరిపోయారని ఇప్పటికీ చెప్పుకుంటారు.
 - సాక్షి, హైదరాబాద్
 
 బీజేపీ చూపు మరో పార్టీ వైపు పోకుండా..
 
 బాబు పార్టీలో బెట్టింగుల వెనుక బీజేపీతో మరికొన్ని రోజులు అంటకాగాలన్న వ్యూహమూ దాగుంది. ఓట్ల లెక్కింపులోగా జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారతాయన్న ఆందోళనతోనే ‘గెలుపు ఖాయం’ ప్రచారాన్ని విస్తృతం చేసి, బెట్టింగులు నడపడం ద్వారా టీడీపీ బలంగా ఉందన్న సంకేతాలు పంపాలన్నది ప్రధాన ఉద్దేశమని టీడీపీ నేతలే చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతోందన్న ఉద్దేశంతో బాబు ఆ పార్టీతో పొత్తుకు తహతహలాడటం తెలిసిందే. ఎన్డీఏలో చక్రం తిప్పుతానంటూ బాబు ప్రచారం చేసుకోగా, తీరా పోలింగ్ రోజే టీడీపీ వెనుకబడిందన్న విషయం తెలిసిపోయింది. దాంతో బీజేపీ తమను వదిలేసి కొత్త సమీకరణలపై దృష్టి సారిస్తుందని, అప్పుడు జాతీయ స్థాయిలో తన పరువు తగ్గిపోతుందన్న ఆందోళన బాబును వెంటాడుతోంది. సీమాంధ్రలో టీడీపీ ఓడినా, ఢిల్లీలో అధికారం చేపట్టడానికి అవసరమైన సంఖ్యా బలం ఎన్డీఏకు లభిస్తే తమను దూరం చేసుకోజాలదని... తాము ఓడిపోతున్నామని ముందే గ్రహిస్తే  మాత్రం ఇప్పుడే దూరం పెట్టేస్తారన్నది టీడీపీ నేతల భయం. ఎన్నికల అనంతరం కేంద్రంలో మద్దతు కోసం కొత్త పొత్తులు అనివార్యమవుతాయన్న ఎన్డీఏ కూటమిలోని అగ్రనేతలు కూడా హెచ్చరించడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారని అంటున్నారు. అందువల్ల ఎన్నికల ఫలితాల వరకు టీడీపీ గెలుస్తుందన్న ప్రచారం సాగించడం ద్వారా ఎన్డీఏ నేతల్లో మరో ఆలోచన రాకుండా కట్టడి చేయగలిగితే చాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే టీడీపీ గెలుస్తుందని విపరీత ప్రచారానికి దిగారన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ వారం రోజులపాటు గెలుస్తామన్న అంశంపై బెట్టింగ్‌లు జోరుగా సాగిస్తే  బీజేపీ కూడా తమ విజయంపై ధీమాగా ఉంటుందన్న ఉద్దేశంలో టీడీపీ నాయకత్వం ఉంది.
 
 కాగితం, కలం లేకుండానే...
 
 బెట్టింగ్ మొత్తం నమ్మకమే ప్రాతిపదికగా సాగుతుంది. నోటి మాటలు, ఫోన్ కాల్స్ ఆధారంగా కోట్లలో వ్యవహారాలు నడుస్తాయి. సాధారణంగా బుకీలు కొత్త వారితో పందేలు కట్టరు. పరిచయస్తులు, పాత కస్టమర్లతో పాటు వారి సిఫార్సుతో వచ్చిన వారితోనే బెట్టింగ్ కాస్తారు. పందెం కాసిన వ్యక్తి నగదు చెల్లించకపోతే అతడిని పరిచయం చేసిన వారే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. పంటర్ (పందెం కాసే వ్యక్తి) - బుకీ మధ్య జరిగే ఫోన్ సంభాషణల్ని బుకీలు తమ ల్యాప్‌టాక్‌కు అనుసంధానించిన ప్రత్యేక పరికరం ద్వారా రికార్డు చేస్తారు. ఎంత మొత్తానికి పందెం కాశారు, ఎంతకు ఎంత వంటి అంశాల్లో తేడాలు రాకుండా ఈ జాగ్రత్తలు! ఈసారి ఎన్నికల పందేలు కాసే వారి సంఖ్య గతంలోకంటే భారీగా పెరిగిందని బుకీలు, పంటర్లే చెప్తున్నారు. పరిచయస్తులు, వారి ద్వారా వచ్చిన వారి నుంచేగాక కొత్తవారి నుంచీ బెట్టింగ్స్ స్వీరిస్తున్నారు. అయితే పంటర్ తాను పందెం కాసే మొత్తాన్ని ముందే బుకీకి చెల్లించాలి. దీన్ని బుకీ ఏజెంట్ వసూలు చేసుకుంటాడు. ఒక కోడ్ వర్డ్ చెప్పి, తక్కువ డినామినేషన్ కలిగిన కరెన్సీ నోటును కట్ చేసి వారికి ఒక ముక్క ఇస్తాడు. ఫలితాల అనంతరం పంటర్ పందెం గెలిచిన పక్షంలో బుకీ చెప్పిన చోటుకు వచ్చో, ఏజెంట్‌ను సంప్రదించో కోడ్ చెప్పి కరెన్సీ నోటును చూపిస్తే పందేనికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement