సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలన్నింటినీ స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఓట్ల లెక్కింపునకు మరో వారం రోజుల గడువు ఉండటంతో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. దీంతో పాటు కౌంటింగ్ రోజు బందోబస్తు కోసం 37 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రంలోనే ఉంచారు. ఈ కంపెనీల్లో 30 స్ట్రాంగ్ రూమ్స్ వద్ద విధుల్లో ఉండగా... మిగిలిన ఏడింటిని రిజర్వ్‌లో ఉంచారు. తెలంగాణలో 26,135, సీమాంధ్రలో 68,678 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఈవీఎంలను ఆయా జిల్లా హెడ్‌క్వార్టర్లకు తరలించి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచారు. సదరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలనూ అక్కడే ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రాంతాల్లో స్ట్రాంగ్‌రూమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం జిల్లా కేంద్రమైన వికారాబాద్‌తో పాటు చేవెళ్లలోనూ స్ట్రాంగ్ రూమ్ ఉంది.
స్ట్రాంగ్ రూమ్స్ భద్రతా ఏర్పాట్లివీ...
స్ట్రాంగ్ రూమ్‌లకు ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసి ఒకటి రూమ్ ఇన్‌చార్జ్ వద్ద, మరోటి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ స్థాయి అధికారి వద్ద ఉంచారు.
24 గంటలూ సాయుధ గార్డును ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్విరామంగా పని చేసే కంట్రోల్ రూమ్ నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారిని ఉంచారు. రూమ్‌ల వద్ద జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.
మూడంచెల భద్రతలో భాగంగా తొలి అంచెలో (రూమ్ డోర్ దగ్గర) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉండాలి. దీనికోసం కనీసం ఒక సెక్షన్ (13 మంది) బలగాలు, 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ఓ ప్లటూన్ (39 మంది) ప్రత్యేకంగా కేటాయించారు.
రెండో అంచెలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో అంచెలో జిల్లా సాయుధ బలగాలను మోహరించారు.
ఈవీఎంలు భద్రపరిచిన భవన ప్రాంగణంలోనే స్ట్రాంగ్‌రూమ్ ప్రవేశ ద్వారం కనిపించేలా టెంట్లువేసి అభ్యర్థుల ప్రతినిధులకు సౌకర్యాలు కల్పించారు. ఇలా అవకాశం లేని చోట సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ ద్వారాన్ని టెంట్‌లో ఉండి చూసేలా, అప్పుడప్పుడు రూమ్స్ సమీపంలోకి స్వయంగా వెళ్లి పర్యవేక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలోకి పోలీసు ఉన్నతాధికారుల సహా ఎవరి వాహనాలను అనుమతించట్లేదు.
స్ట్రాంగ్ రూమ్స్ సమీపంలోని వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు కేంద్ర సాయుధ బలగాల వద్ద ఉన్న లాగ్‌బుక్‌లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియనూ వీడియోగ్రఫీ చేస్తున్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలసి ప్రతి రోజూ స్ట్రాంగ్‌రూమ్స్‌ను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక ఇస్తున్నారు. వీరితో పాటు పోలీసు ఉన్నతాధికారులూ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.