రైతుల రుణమాఫీ హామీ తెలంగాణ, సీమాంధ్రకే పరిమితం
- కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల రుణాలమాఫీ హామీ కేవలం తెలంగాణ, సీమాంధ్రకే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తమ పార్టీ రుణమాఫీ హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చలేదన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటు తెలంగాణ పునర్నిర్మాణానికి, అటు సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలూ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోనే స్పష్టంగా చెప్పామన్నారు. దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోగానే భావించాలన్నారు.
భారత్ వెలిగిపోతోందంటూ 2004లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 2003-04 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే యూపీఏ హయాంలోనే వృద్ధిరేటు మెరుగ్గా ఉందన్నారు. 2000-01, 2002-03 ఆర్థిక సంవత్సరాలు ఆర్థిక సరళీకరణ చరిత్రలోనే అత్యంత గడ్డురోజులుగా ఆయన పేర్కొన్నారు. ఫలితంగా అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఆర్థికమంత్రిని మర్చాల్సి వచ్చిందన్నారు. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘యూపీఏ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని వర్గాలు మార్పును కోరుకుంటున్నాయి’ అని బదులిచ్చారు.