సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో మీరు వేయబోయే నిర్ణయాత్మక అడుగుపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్ యాదవ్ రాష్ట్రపతితో సమావేశమై దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రపతికి ఎంపీలంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో ప్రణబ్‌ముఖర్జీని సత్కరించారు. పొన్నం ప్రభాకర్ అగ్గిపెట్టెలో పట్టే శాలువాను ప్రణబ్‌కు అందజేశారు. అనంతరం మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నూతన సంవత్సరంలో మీ నిర్ణయాత్మక అడుగు మా భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నందున విభజన ప్రక్రియ ముగించడానికి కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈలోపే విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తొందరగా నిర్ణయం తీసుకోవడంవల్ల భావోద్వేగాలు త గ్గుతాయి. ఆ పని మీరు చేస్తారనే నమ్మకం మాకుంది’’అని పేర్కొన్నారు. వారు చెప్పిందంతా సావధానంగా విన్న ప్రణబ్ చిరునవ్వుతో ‘‘అంతా మంచే జరగాలి.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు’’అని అన్నట్లు తెలిసింది. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. విభజన బిల్లు త్వరగా పార్లమెంట్ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ర్టంలో ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు తలెత్తాయని, ఇంకా కలిసి ఉండే అవకాశాలు ఏమాత్రమూ లేవని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత తొందరగా విభజన ప్రక్రియను ముగించి రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తేనే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు కలుగుతుందనే విషయాన్ని రాష్ట్రపతికి వివరించామన్నారు. మరోవైపు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, మంత్రి జె.గీతారెడ్డి వేర్వేరుగా రాష్ర్టపతిని కలిశారు.
మీ నిర్ణయంపైనే మా భవిష్యత్!
Published Mon, Dec 30 2013 3:44 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement