పదిమందికి అన్నం పెడితే పరమానందం
బుల్లితెర నటుడు, నిర్మాత శ్రీరామ్
పి.గన్నవరం: ఫంక్షన్ల పేరిట సొమ్ము వృథా చేసేకన్నా పదిమందికీ అన్నం పెడితే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని టీవీ నటుడు, సీరియల్ నిర్మాత కొలిశెట్టి శ్రీరామ్ అన్నారు. ‘విధి, ఉమ్మడి కుటుంబం, కావ్యాంజలి, రక్త సంబంధం’ వంటి సీరియల్స్‌లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ఆయన స్వగ్రామం పి.గన్నవరంలో జరుగుతున్న అమ్మవారి జాతరకు వచ్చారు. ఆ సందర్భంగా సోమవారం తనను కలిసిన ‘సాక్షి’తో మనోభావాలను ఇలా పంచుకున్నారు.
‘బీఎస్సీ, బీఈడీ చేశాను. టీచర్ కావాలనుకునేవాడిని. ఎస్సై కావాలనేది నాన్న కల. అందుకోసం రోజూ పొద్దున్నే నిద్రలేపి నాతో వ్యాయామాలు చేయించేవారు. ఫిజికల్ టెస్ట్‌లో పాసైనా, ఆసక్తి లేక రాత పరీక్ష ఎగ్గొట్టేశా. దాంతో నాన్న కోపడ్డారు. ఏదైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వెళ్లాను. ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాను. కొన్ని నచ్చక చేరలేదు. ఆ సమయంలో దర్శకుడు అనిల్‌కుమార్ ‘విధి’ సీరియల్‌లో నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, డేంజర్ తదితర చిత్రాల్లో నటించాను. తర్వాత ‘రాధాకల్యాణం’ సీరియల్ నిర్మించాను. ఓ చానల్‌లో గేమ్‌షో చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘వరూధిని పరిణయం’ సీరియల్‌కు నిర్మాతను.
ఫంక్షన్లు చేసుకోం..
మా ఇంట్లో ఏ ఫంక్షన్లూ చేసుకోం. నా పుట్టినరోజు, మా పెళ్లిరోజు కూడా జరుపుకోకుండా అనాథాశ్రమాలకు వెళ్లి ఫంక్షన్లకు అయ్యే డబ్బును అక్కడి వారికి ఇస్తుంటాం. ఒక ఫిజికల్లీ చాలెంజ్‌డ్ అబ్బాయిని చదివించి ప్రయోజకుడిని చేశాను. ఎంతో సంతృప్తి నిచ్చింది. అమలాపురం సమీపంలోని జనుపల్లిలోని రామాలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష అందించా. ఏటా అనేకమంది పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. భగవంతుని ఆశీస్సులున్నంత కాలం నా వంతు సేవ కొనసాగిస్తా.’