
పవన్ అభిమాని గొంతు కోసిన దుండగులు
గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ వద్ద ఘటన
గచ్చిబౌలి: గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కన్నా శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. ప్రస్తుతం అతను హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు.
సినీ అగ్రహీరోలు వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.