ఆదిలోనే అవకాశాలు రావడం అదృష్టం
టీవీ, సినీ నటి ఝాన్సీ
రాజమండ్రి కల్చరల్ :టీవీ ప్రసారాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే తనకు అవకాశాలు వచ్చాయని, అది తన అదృష్టమని ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఝాన్సీ తెలిపారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమండ్రి వచ్చిన ఆమె తన టీవీ, సినీ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
రాణించడానికి కారణం
టీవీ ప్రసారాల ప్రారంభ దశలోనే నాకు అవకాశాలు రావడంతో అన్ని రకాల యాసలు అలవాటయ్యాయి. విభిన్న పాత్రలు లభించాయి. చాలామంది ప్రేక్షకులు నన్ను కలిసినప్పుడు నా నటన యాంత్రికంగా ఉండదని, బుల్లితెరపై నన్ను చూస్తుంటే కుటుంబ సభ్యురాలిని చూసినట్టే ఉంటుందని చెబుతుంటారు. దానికి కారణం తొలితరం నటిని కావడమే.
చదువూసంధ్యా
నేను మాస్టర్ ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ చేశాను. అలాగే మెడికల్ లాలో డిప్లొమా కూడా చేశాను.
నేటి సినిమాల తీరుతెన్నులు
ఈ మధ్య విడుదలవుతున్న చిన్న సినిమాలు చాలా బాగుంటున్నాయి. చిన్న సినిమా కొత్త ఆలోచనలకు వేదికగా మారింది. దర్శకుడి సృజనాత్మకత, ప్రతిభ అన్నీ చిన్న సినిమాల్లో వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమకు పెద్ద సినిమా ఎంత ముఖ్యమో, చిన్న సినిమా కూడా నా దృష్టిలో అంతే ముఖ్యం.
నా సినిమాల గురించి
ఎన్ని సినిమాల్లో చేశానో లెక్కపెట్టుకోలేదు. సుమారు 50 సినిమాలు చేసి ఉండొచ్చు. అభిమాన హీరో ఎవరంటే చెప్పడం కష్టం. అక్కినేని నాగార్జున, జగపతిబాబుల నటనంటే ఇష్టపడతాను.
సాక్షితో అనుబంధం
సాక్షితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో వచ్చే సిటీ ప్లస్‌లో ‘ఝాన్సీ కీ రాణి’ పేరిట ఓ ఫీచర్ చేస్తున్నా.