
తెలుగు తమ్ముళ్ల ‘ఉపాధి’ మార్గం!
- టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు కూలీల తరలింపు
- వీఆర్‌పీలే సూత్రధారులు
- పలు చోట్ల నిరసనలు... అయినా బేఖాతరు
రోలుగుంట/బుచ్చెయ్యపేట, న్యూస్‌లైన్: ఏమీ లేకున్నా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వాలి... జనాన్ని పిలిస్తే రారాయే... మరేం చేయాలి... తెలుగు తమ్ముళ్ల దృష్టి ‘ఉపాధి’ కూలీలపై పడింది. అంతే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్‌కి వారిని తరలించేశారు. దీనిపై కొందరు నిరసన వ్యక్తంచేసినా భేఖాతరంటూ తమ పని పూర్తి చేశారు. రోలుగుంట మండలం శరభవరం, బుచ్చెయ్యపేట మండ లం గున్నెంపూడి గ్రామాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ.
రెండు చోట్లా కూలీల తరలింపులో వీఆర్‌పీలే కీలకపాత్ర వహించారన్న ఆరోపణలు రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...శరభవరం పంచాయతీ పరిధిలోని పెదచెరువు అభివృద్ధికి రూ.16 లక్షల ఉపాధి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను 59 జట్లతో వీఆర్పీ బండి రాజు ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. గురువారం యథావిధిగా కూలీలు పనులు ప్రారంభించారు. వాస్తవంగా నాలుగు గంటలపాటు పనులు పూర్తి చేయాలి. ఇందుకు భిన్నంగా ఏడు జట్లకు గురువారం ముందే మస్తర్లు వేయించారు.
గంటన్నర తరువాత టీడీపీ అభ్యర్థి రాజు నామినేషన్ వేస్తున్నారని, దానికి తరలిరావాలంటూ బయట వ్యక్తుల నుంచి కబురందింది. వెళ్లేందుకు వీఆర్‌పీ కూడా సై అనడంతో ఈ ఏడు జట్లు పనులు వదిలి ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. వీఆర్‌పీ మద్దతు వల్లే కూలీలు నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారని సర్పంచ్ బోళెం దారవెంకటలక్ష్మి, పంచాడ పెదబాబు తదితరులు గురువారం ఉపాధి పథకం ఏపీఓ డి.కాశివెంకటఅప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఉపాధి కూలీ లతో రాజకీయాలు చేయడం సబవుకాదని, ఇందుకు కారకుడైన వీఆర్‌పీపై చర్య తీసుకోవాలని కోరారు.
గున్నెం పూడి కూలీల ఆగ్రహం
టీడీపీ అభ్యర్థి నామినేషన్ కోసం ఉపాధి పనులు నిలిపివేసిన వీఆర్పీ తీరుపై గున్నెంపూడి గ్రామ నాయకులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ సంతబయలు చెరువులో పని కోసం గురువారం ఉదయం సుమారు 600 మంది కూలీలు వెళ్లారు. సగం కాలం పనిచేసిన తర్వాత వీఆర్పీ నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ‘చోడవరం టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు వెళ్లాలంటూ కూలీలందరినీ చెరువు నుంచి పంపించి వేశారు’ అని వార్డు సభ్యులు అల్లం శ్రీను, ముచ్చకర్ల అప్పారావు, పల్లా రాజు, కేశంశెట్టి లక్ష్మి, అల్లం రాజబాబు, అల్లం జ్యోతి, పల్లా పుష్ప, కూలి నాయకులు సోమిరెడ్డి తాతారావు, సోమిరెడ్డి అప్పారావు, శ్రీను, నక్క రాజు, రమణ, ఆరేవు అప్పారావు, మామిడి సత్తిబాబు తదితరులు ఆరోపించారు.
ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజ రు కావాల్సి ఉన్నందున అరగంట ముందు పనినిలుపు చేయాలని బుధవారం కోరినా వీఆర్పీ అంగీకరించలేదని, గురువారం మాత్రం బెదిరించి పంపారని చెప్పారు. ‘టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు వెళ్లని వారికి మస్తర్లు వేయం. కూలి డబ్బులు ఇవ్వం’ అంటూ టీడీపీ నాయకులతో బెదిరించి మరీ వీఆర్పీ పంపడంపై వీరు నిరసన వ్యక్తం చేశారు. వీఆర్పీగా పనిచేస్తూ టీడీపీకి కొమ్ముకాస్తున్నందున అతనిపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని పీడీకి, ఎంపీడీఓ, ఏపీఓ, మండల ప్రత్యేక అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీఆర్‌పీ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఇష్టమున్న వారు వెళ్లాలని మాత్రమే చెప్పాను తప్ప వారిపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
పీలా నామినేషన్‌కూ తరలింపు
కశింకోట: అనకాపల్లి టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్‌సత్యనారాయణ నామినేషన్‌కు జనం లేకపోవడంతో మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలను సమీకరించి తరలించారని వైఎస్సార్ సీపీ స్థానిక నాయకుడు బొడ్డేడ సత్యసాయి బాలాజీ ఆరోపించారు. నామినేషన్‌కు వెళ్లేందుకు వీలుగా పనులను అర్ధంతరంగా నిలిపివేశారని తెలిపారు. ఇందుకు ఉపాధి సిబ్బంది సహకారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దీన్ని స్థానిక ఏపీఓ వద్ద ప్రస్తావించగా ఉపాధి పనులకు ఎటువంటి ఆటంకం కలగలేదన్నారు. మండలంలోని 23 గ్రామాల్లోనూ పనులు జరిగాయని చెప్పారు. ఎండతీవ్రత కారణంగా కొందరు కూలీలు ముందుగానే పనిపూర్తి చేసి వెళ్లిపోయారని తెలిపారు. పనిపూర్తయ్యాక కూలీలు ఎక్కడికి వెళ్లారన్న దానితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.