
నాకు కాదని ...కోడెలకు టికెటా... చూస్తా
గుంటూరు జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. పచ్చ పార్టీ తెలుగు తమ్ముళ్లు రోడ్డు ఎక్కారు.
గుంటూరు జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. తాను అశించిన సీటు మరొకరికి ఎలా కట్టబెడతారాంటూ తెలుగు తమ్ముళ్లు రోడ్డు ఎక్కారు. సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ తనకే కేటాయించాలంటూ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బూరి మల్లి టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. తనకు కాకుండా.... కోడెలకు టికెట్ ఎలా ఇస్తారో చూస్తానంటూ వీరంగం సృష్టించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జిల్లా సీనియర్ నేతలకు వ్యతిరేకంగా తెలుగుతమ్ముళ్లు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అసలు నరసరావుపేట నేత అయిన కోడెలకు సత్తెనపల్లి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అందులో భాగంగా నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దాంతో ఇన్నాళ్లూ ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాద్కు ఈ సారి సత్తెనపల్లి టికెట్ కేటాయించింది. జిల్లా తెలుగు యువతకు అధ్యక్షుడిగా ఉండి, ఇన్నాళ్లూ సత్తెనపల్లిలో పార్టీని బతికిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా, పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ మల్లి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు.