ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఇ. ప్రసాద్ ఉపాధ్యాయుడు ఇ. ప్రసాద్ రాసి ఇచ్చిన సంజాయిషీ లేఖ
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా నిలవాల్సిన గురువు అందుకు విరుద్ధంగాప్రవర్తించారు. తెలుగు పాఠాలు చెప్పాల్సిన ఆయన తరగతి గదిలో ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందులు పడిన బాలికలు ఇన్నాళ్లూ సహనం వహించారు. అయితే ఆయనలో మార్పులేదు సరికదా వెకిలి చేష్టలు మరింత ఎక్కువయ్యాయి.దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారంతాపాఠశాలను ముట్టడించారు. ఈ సంఘటన కంచిలి మండలం జలంత్రకోట జిల్లా పరిషత్ (ఒడియా) ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘోరంపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కంచిలి: జలంత్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇ.ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన కొన్నాళ్లుగా ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థినులు బయటకు చెప్పుకోలేకపోవడంతో దీన్ని అలుసుగా తీసుకున్న ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయారు. తరగతి గదిలో పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు చెబుతూ, చేయకూడని పనులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించేవారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని శుక్రవారం పాఠశాలకు వెళ్లిన మీడియా ఎదుట కన్నీరుమున్నీరై వివరించారు. పాఠాలు బోధించాల్సిన గురువే ఇంతటి దారుణంగా ప్రవర్తిస్తే తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మందలించినా తీరుమారలే..: ఉపాధ్యాయుడు ప్రసాద్ వ్యవహార శైలిపై కొంతమంది విద్యార్థినులు ఇప్పటికే ప్రధానోపాధ్యాయడు జె.బాలకృష్ణ దృష్టికి తెచ్చి ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుడ్ని పిలిపించి ఇప్పటికే మందలించారు. అయినా ఆయనలో మార్పురాలేదు. దీంతో విద్యార్థినులంతా ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు రోజులుగా కొంతమంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. శుక్రవారానికి తల్లిదండ్రుల ఆందోళన తీవ్రమైంది. ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా పట్టుబట్టారు. మిగిలిన ఉపాధ్యాయులు కూడా గ్రామస్తులతో కలిసి తెలుగు ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో దిగివచ్చిన ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారు. క్షమాపణ కోరుతూ లేఖరాశారు. అయితే గ్రామస్తులు మాత్రం శాంతించలేదు. ఉపాధ్యాయుడ్ని కఠినంగా శిక్షిం చాల్సిందేనని పట్టుబట్టారు. విషయం విద్యాశాఖాధికారుల దృష్టికి వెళ్లింది. డిప్యుటీ ఈవో టి.జోగారావు, ఎంఈవో ఎస్. శివరాంప్రసాద్‌లు శుక్రవారం పాఠశాలకు వచ్చి సంఘటనపై ఆరాతీశారు. ఉపాధ్యాయుడ్ని విచారించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.బాలకృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
ఉపాధ్యాయుడు సస్పెన్షన్: అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో సాయిరాం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment