పోలీసు స్టేషన్‌లో ఉపాధ్యాయుడిని విచారణ చేస్తున్న సీఐ హరినాథ్
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తన చేష్టల ద్వారా వికృతరూపాన్ని బయటపెట్టాడు. ఆయన చేష్టలు శ్రుతిమించడంతో విద్యార్థినులు తమ ఇళ్లల్లో చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కామోపాధ్యాయుడి బడితపూజ చేయాలనుకున్న చర్యలను ఉపాధ్యాయులు నిలువరించారు. బాధితుల తల్లిదండ్రుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నింబగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొమ్మిది మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ వెంకటేశులు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నారు. ఈయన ఇటీవల కాలంలో పాఠాలను పక్కనపెట్టి అమ్మాయిలపై ‘ఫోకస్’ పెట్టాడు. ఓనీ తీసి డ్యాన్స్ చేయాలని, తనకు ముద్దులు పెట్టాలని అమ్మాయిలను ఒత్తిడి చేసేవాడు. ద్వందార్థాలు, వెకిలి చేష్టలు వికృతరూపం దాల్చాయి. టార్చర్ తట్టుకోలేక కొంతమంది విద్యార్థినులు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆగిపోతున్నారు.
చదవండి: (ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!)
ఇందుకు గల కారణాలను పలువురు తల్లిదండ్రులు తెలుసుకుని 15 రోజుల క్రితం టీచర్ వెంకటేశులుపై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు పోలీసులు సదరు టీచర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తాను సరిగా చదవకపోతే కొట్టాను తప్ప, అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పడంతో.. మరోసారి ఇలా జరగకుండా బుద్ధిగా ఉండాలని వెంకటేశులుకు చెప్పి పంపించేశారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. తన పంథా మార్చుకోలేదు. మళ్లీ అమ్మాయిలను వేధించడం కొనసాగించాడు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తల్లిదండ్రులు రగిలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల వద్దకెళ్లి ఆందోళనకు దిగారు.
తెలుగు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటాడా అంటూ ఆగ్రహంతో టీచర్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని పసిగట్టిన హెచ్‌ఎం విజయలక్ష్మి సదరు టీచర్ వెంకటేశులును ఓ గదిలో పెట్టి తాళం వేసి.. పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment