ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: ఆలయాలకు రాజులు, దాతలు ఇచ్చిన మాన్యాలు పరాధీనమవుతున్నా నిరోధించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆదాయంపైనే ధ్యాస తప్ప ఆలయాల బాగోగులు పట్టించుకునేవారు లేకపోవడంతో క్రమేణా అవి శిథిలస్థితికి చేరుతున్నాయి. కొన్ని ఆలయాలకు భూములు ఉన్నా అవి ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. ఆ ఆలయాలకు వేరే రూపంలో ఆదాయం లేకపోవడంతో దేవాదాయ శాఖ కూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు. ‘సమరసాక్షి’ పేరుతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా వివిధ ఆలయాలను న్యూస్‌లైన్ విజిట్ చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక ఆలయాల్లో కనీసం నిత్యధూపదీప నైవేద్యాలకు సైతం దిక్కులేని దుస్థితి. అటువంటి ఆలయాలను ఆదుకునేందుకు దేవాదాయ శాఖ గతంలో నిత్యధూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి బకాయిలను దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు చెల్లించాలని అర్చక సంఘాలు కోరుతున్నాయి. ఆలయ ఆదాయాన్ని బట్టి కొన్ని ఆలయాల్లో అర్చకులకు పడికరం అందచేస్తున్నారు. పలు ఆలయాల్లో ఇస్తున్న మొత్తం ఏ మాత్రం చాలని పరిస్థితి నెలకొంది. కొన్ని ఆలయాలకు పొలాలు ఉన్నా వాటిమీద వచ్చే ఆదాయం తక్కువే. ఆలయ అధికారులు, సిబ్బంది జీతభత్యాలకు, ఫీజుల చెల్లింపునకు ఎక్కువ మొత్తం సరిపోతుండటంతో అర్చకులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
ఆదాయం బాగా ఉన్న ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి వేతన స్కేళ్లను అమలు చేస్తున్నారు. పలు ఆలయాల్లో కార్యనిర్వహణాధికారులు, మేనేజర్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఆలయాల బాగోగులను పట్టించుకోవడంలేదనే విమర్శలు భక్తుల నుంచి వినవస్తున్నాయి. ఎక్కువ మంది అధికారులు పదికిపైగా ఆలయాలను పర్యవేక్షించాల్సి రావడంతో ఏ ఆలయంపైనా సరైన శ్రద్ధ చూపలేని స్థితి నెలకొంది. కొందరు తామే సర్వం అనే భ్రమతో ఆలయ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటూ పాలనను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఆలయాలు ఏ సమయంలో తెరుస్తారో కూడా ఎవరూ చెప్పలేని దుస్థితి. అనేక ఆలయాల్లో విలువైన బంగారు, వెండి వంటి వస్తువులకు కాళ్లు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మేలుకొని ఆస్తులను మదింపు చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. బంగారు, వెండి వస్తువులతో పాటు ఆలయాలకు ఉన్న ఆస్తులు, భూములు వంటి వివరాలను సేకరిస్తున్నారు.
దెబ్బతింటున్న ఆలయాల ప్రాశస్త్యం
పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా పురావస్తు శాఖ సహకారం తీసుకుని ఆలయానికి, ఆలయ శిల్పసంపదకు, ప్రాశస్త్యానికి భంగం కలగని పద్ధతిలో జీర్ణోద్ధరణ చేయాలి. అనేక మంది కార్యనిర్వహణాధికారులు ఒంటెత్తుపోకడలు ప్రదర్శిస్తూ ఇష్టానుసారం ఆలయాలను కూల్చివేసి తమకు నచ్చిన విధంగా నిర్మిస్తుండటంతో ఆలయ ప్రాశస్త్యం దెబ్బతింటోంది. పలు ఆలయాల్లో పనిచేసే అర్చకులకు పూజాదికాల్లో కనీస ప్రావీణ్యం ఉండటం లేదు. ఉన్నతాధికారుల తనిఖీల్లో జీన్స్ ప్యాంటుతో భక్తులకు తీర్థమిస్తున్న పూజారుల ఉదంతాలూ బయల్పడ్డాయి. ఆగమ శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యపూజలు, నైవేద్యాలు సరిగా జరిగేలా చూడాల్సి ఉండగా పలు ఆలయాల్లో అందుకు భిన్నమైన వాతావరణ నెలకొంది. సిబ్బందిలో కొందరు మద్యం తాగి ఆలయాలకు రావడం, పాన్‌పరాగ్‌లు,గుట్కాలు నములుతూ భక్తులతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలూ ఇటీవల వెలుగుచూశాయి. యర్రగొండపాలెంలోని వృశ్చిక మల్లికార్జునస్వామి ఆలయం రాజుల కాలంలో నిర్మించారు. ఈ ఆలయం ఒకప్పుడు వైభవాన్ని అనుభవించింది. ప్రస్తుతం ఈ ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది. ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారులు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పలువురు భ క్తులు కోరుతున్నారు.
దేవునికే.. దిక్కులేదు
Published Sat, Jan 11 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement