దేవాదాయ భూములు... దేవాలయాల పోషణకు, ధూపదీప నైవేద్యాల నిర్వహణకు ఒకప్పుడు దాతలు, భూస్వాములు, జమీందారులు, రాజులు దానమిచ్చిన భూములు! కానీ ఇప్పుడు అవంటే అందరికీ అలుసే! శిస్తు లేకుండానే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా అడిగేవారే కరువయ్యారు! ఈ భూముల సంరక్షణకు ఆ శాఖలో ప్రత్యేక విభాగమూ లేదు! ఒకవేళ రెవెన్యూ శాఖ సహాయంతోనో, లేదా ఆక్రమణదారులపై కోర్టులో కేసులు వేసినా పోరాడితేనో పెద్దగా మార్పు ఉండట్లేదు. ఒకవేళ సాగులోనున్న రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నా మళ్లీ మరో రైతులకు అప్పగించాల్సిందే మరి! మరోవైపు దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం జిల్లాలోని పలు దేవాలయాలకు భూమి ఉన్నట్లున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అందుకు భిన్నంగా పరిస్థితి ఉంటోంది! ఇలాంటి స్థితిలో కాస్త రక్షణగా ఉండాల్సినవి ట్రస్టు బోర్డులే. కానీ ఇప్పటికీ వాటి నియామకం జరగలేదంటే రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 823 ఆలయాలు ఉన్నాయి. వీటిలో సగానికి సగం ఆలయాలకు వివిధ రకాల భూములు ఉన్నాయి. అందులో వ్యవసాయానికి అనువుగా ఉండే మాగాణి 7,855.21 ఎకరాలు, మెట్ట భూమి 6,386.44 ఎకరాలు ఉన్నాయి. ఈ మొత్తం 14,241.65 ఎకరాలు దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం ఉన్నప్పటికీ ఇదంతా స్వాధీనంలో లేదు. దాదాపు 6,298 ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉంది. దీని నుంచి పైసా కూడా ఆలయాలకు శిస్తు రావట్లేదు. జిల్లా కేంద్రంలోని కోదండరామ ఆలయానికి మాగాణి, మెట్ట కలిపి 485.72 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఎక్కువ భాగం శ్రీకాకుళం, నరసన్నపేట మండలాల్లో ఉంది. ఆ భూమిని పలువురు రైతులు దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్నారు. దీనిపై తమకు రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చిందని వారెవ్వరూ శిస్తు చెల్లించడం మానేశారు. అలాగని ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితిలో దేవాదాయశాఖ ఉంది. ఈ ఒక్కటే కాదు జిల్లాకేంద్రంలోని జగన్నాథస్వామి ఆలయంతో పాటు గార, శ్రీముఖలింగం, నరసన్నపేట, టెక్కలి, వీరఘట్టం, రాజాం, సంతకవిటి, ఇచ్ఛాపురం, కంచిలి తదితర పలు ప్రాంతాల్లో దేవాలయాల పరిస్థితి ఇలాగే ఉంది. సొంత భూములపై ఆదాయం రాక, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు లేక నిర్వహణపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
విలువైన స్థలాలకు రక్షణ కరువు...
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని అరసవల్లి దేవస్థానానికి చెందిన సుమారు రెండున్నర ఎకరాల భూమిని గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బడ్జెట్ హోటల్, టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కేటాయించారు. దీనిలో దేవాదాయ శాఖ నుంచి లీజు ఒప్పందం కింద 1.28 ఎకరాలు భూమిని తీసుకున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ బడ్జెట్ హోటల్ ఆదాయంలో కొంత శాతం అరసవల్లి ఆలయానికి ఇవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్ హోటల్‌ను లీజుకిచ్చిన ఏపీటీడీసీ... ఆ పక్కనే కన్వెన్షన్‌హాల్, స్విమ్మింగ్ పూల్ వంటి నిర్మాణాలు చేసుకోవచ్చని లీజుదారులకు అనుమతులు ఇచ్చేసింది. తీరా నిర్మాణాలు ఒప్పందాలకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ దేవాదాయశాఖ అభ్యంతరం తెలియజేసింది. టౌన్‌ప్లానింగ్ అప్రూవల్ సహా ఇతరత్రా అనుమతులేవీ లేకుండా మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించదలచిన కల్యాణ మండపం ఉనికినే ప్రశ్నార్థం చేసేలా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి.
ఆ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలనే డిమాండుతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇటీవల భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఇలా అరసవల్లి భూములకే రక్షణ లేకపోతే ఇక మిగతా ఆలయాలకు చెందిన విలువైన స్థలాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తున్న నేపథ్యంలో గత పదీపదిహేనేళ్లుగా అసలు ఆలయాలకు భూములు, స్థలాలు ఇచ్చే దాతలే కనిపించట్లేదు. ఇలాంటి విలువైన భూములను కబ్జాదారుల చేజిక్కకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కానీ అధికార పార్టీ నాయకులు ఆక్రమణదారులకే వంతపాడుతుండటం వల్లే సమస్య మరింత క్లిష్టమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రస్టుబోర్డుల్లోనూ రాజకీయమే...
దేవాలయాల నిర్వహణకు ట్రస్టు బోర్డు చాలా కీలకం. కానీ వాటి గడువు ముగిసి ఏళ్లు గడిచిపోతున్నా నియామకమే జరగట్లేదు. ఆలయాల పాలన తమ కనుసన్నల్లో నడవాలని టీడీపీ నాయకులు కోవడం, తమ అనుయాయులకు బోర్డులో స్థానం కల్పించడం అనే ఉద్దేశాలతో పనిచేస్తుండటంతో నియామకాల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. జిల్లాలో రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తున్న ‘ఎ’ గ్రేడ్ ఆలయాలు మూడే ఉన్నాయి. వాటిలో కేవలం ఒక్క పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయానికి మాత్రమే ట్రస్టుబోర్డు నియామకం జరిగింది. మిగతా రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం కూర్మనాథస్వామి ఆలయాలకు ఇప్పటివరకూ ట్రస్టుబోర్డు నియామకంపై దృష్టి పెట్టలేదు. ఈ రెండూ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అలాగే ‘బి’ గ్రేడు ఆలయాలు 16 ఉంటే వాటిలో నాలుగింటికి, ‘సి’ గ్రేడు ఆలయాలు 786 ఉంటే వాటిలో ఒక్క గుడికి మాత్రమే ఇప్పటివరకూ ట్రస్టుబోర్డును నియమించారు. టీడీపీ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment