తాత్కాలిక సెక్రటేరియట్.. మేధా టవర్స్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. పలు ప్రభుత్వ శాఖలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఐటీ సెజ్‌లో భాగంగా వైఎస్సార్ హయాంలో దీనిని 30 ఎకరాల్లో నిర్మించారు. 2006లో నిర్మాణం చేపట్టి 2010లో పూర్తిచేశారు. ఎల్ అండ్ టీ, ఏపీఐఐసీ నేతృత్వంలో సుమారు రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనంలో 11 వేల మంది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం నాలుగు కంపెనీలు ఇందులో కొనసాగుతుండగా 20 వేల చదరపు అడుగుల స్థలం మాత్రమే వినియోగంలో ఉంది. విజయవాడలో తగినంతగా ఐటీ అభివృద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం మేధా టవర్స్ టీడీపీ ప్రభుత్వానికి నీడనిచ్చే కల్పతరువుగా కనిపిస్తోంది.
జవహర్‌రెడ్డి ప్యానల్ సిఫారసు మేరకు...
మేధా టవర్స్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటం దీనిని సెక్రటేరియట్‌కు ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని సమాచారం. రాజధాని ప్రాంతంలోని క్యాంప్‌ఆఫీస్‌కు నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు సమీ క్షలు, శాఖాపరమైన పనుల నిమిత్తం రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇక్కడికి రావాలని మంత్రులు, అధికారులకు కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని డిసెంబర్ నాటికి తరలించాలని భావిస్తున్నారు. మిగిలిన అధికార యంత్రాంగం 2016 మార్చి నాటికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాజ ధాని ప్రాంతంలో ప్రభుత్వ శాఖలు, మంత్రుల కార్యాల యాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేలా ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వారిలో పంచాయతీరాజ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్యాంబాబు, హౌసింగ్ సెక్రటరీ లవ్‌అగర్వాల్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హేమ మునిచంద్రలను నియమించారు. ఈ ప్యానల్ అవసరమైన భవంతులు, సౌకర్యాల కోసం వెదుకులాట వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మేధాటవర్స్ విశాలమైన నిర్మాణమయినందున అన్ని విధాలా బాగుంటుందని జవహర్‌రెడ్డి ప్యానల్ గట్టి ప్రతిపాదన చేసినట్టు సమాచారం.
దీని సమీపంలో విశాలమైన స్థలం ఉన్నందున పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, గన్నవరం విమానాశ్రయానికి, జాతీయ రహదారికి చేరువలో ఉండటం వల్ల రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. విశాలమైన గదులు, సమావేశాలకు సరిపడే హాళ్లు, విద్యుత్, ఫోన్, వైఫై సౌకర్యాలు కల్పించేం దుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. దేశ, విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైతే ఏ విషయమైనా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా ఉందని తమ ప్రతిపాదనలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసే యోచన ఉంది. విజయవాడ కంటే గుంటూరులో ఇళ్ల అద్దెలు తక్కువగా ఉండటంతో అవసరమైతే గుంటూరులో మరికొన్ని శాఖలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
85 భవనాల పరిశీలన...
ప్రభుత్వ శాఖలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలను ఇక్కడికి తరలించేలా అవసరమైన భవంతుల కోసం వెదుకులాటలో భాగంగా పలు ఇళ్లను గుర్తించారు. విజయవాడతో పాటు సమీపంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు 85 భవంతులను పరిశీలించారు. కృష్ణా జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ శరత్‌బాబు వీటిని పరిశీలించి వాటి వివరాలు, ఫొటోలను ఉన్నతాధికారులను అందించినట్టు తెలిసింది. విజయవాడ నగరం, విజయవాడ రూరల్, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో గుర్తించిన భవంతుల ఎత్తు, ఎంత విస్తీర్ణం, రహదారి, మంచినీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై పూర్తి నివేదికలను అందించారు. వాటిని పరిశీలించి అనుకూలమైన భవంతులను అద్దెకు తీసుకునేలా రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసు చేయాల్సి ఉంది.